logo

మయూరి ఉద్యానం.. భద్రత కనం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది.

Published : 18 Apr 2024 04:13 IST

యువతి మృతితో బయటపడిన డొల్లతనం

ఒక్క సీసీ కెమెరా కూడా లేని మయూరి పార్కు ప్రధాన ద్వారం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది. అడవిలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదభరితంగా అభివృద్ధి చేసిన ఈ పార్కుకు నిత్యం వేలాది మంది కుటుంబాలు, యువతీ, యువకులు వస్తున్నారు. పార్కుకు వచ్చిన యువతీ యవకుల్లో కొందరు అడవిలోకి కూడా వెళ్తున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టాల్సిన అటవీ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బుధవారం పార్కులో గుర్తు తెలియని యువతి పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటం కలకలం రేపింది. ఇప్పటివరకు ఇలాంటి ఘటన పార్కులో చోటు చేసుకోలేదు. కొన్నేళ్ల క్రితం పార్కులో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో జాతీయ రహదారి- 167 పక్కన పార్కు బోర్డు వద్ద ఏర్పాటుచేసిన కెమెరా, చెరువు కుంట వద్ద మరో కెమెరా మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 14 కెమెరాలు పనిచేయకపోవటంతో పార్కులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

30 మంది సిబ్బంది ఉన్నా.. : మయూరి పార్కులో 30 మంది అటవీ శాఖ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కులోనే ఉండి వివిధ పనులు పనిచేస్తారు. వచ్చే పర్యాటకులపై వారు దృష్టిసారించటం లేదు. శని, ఆదివారాల్లో రాత్రి వేళ పార్కులోని గుడారాల్లో పర్యాటకులు బస చేస్తున్నారు. అక్కడ కూడా నిఘా నేత్రాలు లేవు. పార్కులోని గుట్టపై, గుట్ట వెనక ఉన్న అడ్వెంచర్‌ జోన్‌లో నిఘా నేత్రాల జాడే లేదు. ఈ ప్రాంతాల్లో చెట్లు దట్టంగా ఉండటంతో యువ జంటలు ఇటు వైపు వస్తున్నాయి.
పనిచేయని సీసీ కెమెరాలు : మయూరి పార్కులో వచ్చే పర్యాటకులను ఆకతాయిల ఇబ్బందులకు గురిచేసినా, ఎవరైనా దాడికి పాల్పడినా సీసీ కెమెరాలతో గుర్తించే అవకాశం ఉంటుంది. పర్యాటకులు నిబంధనలకు విరుద్ధంగా పార్కులో వ్యవహరించకుండా పర్యవేక్షణ చేయొచ్చు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీసీ కెమెరాలపై అటవీశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. సీసీ కెమెరాలు పనిచేయినా మరమ్మతులు చేయించలేదు. కొత్త వాటినైనా ఏర్పాటు చేయించలేదు. చెరువు వద్ద సౌర విద్యుత్తుతో నడిచే సీసీ కెమెరా మాత్రమే పనిచేస్తోంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవటం వల్లనే బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతి ఎవరు.. అది ఆత్మహత్యా.. హత్యా అనేది పోలీసులు తేల్చలేకపోయారు.


దురదృష్టకర ఘటన

అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మయూరి పార్కులో ఈ సంఘటన చోటు చేసుకోవటం దురదృష్టకరం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. పనిచేయని సీసీ కెమెరాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తాం. పర్యాటకులకు రక్షణ కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.

సత్యనారాయణ, జిల్లా అటవీశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని