logo

చెరువు కట్ట తెగి.. పొలాల్లో ఇసుక మేట వేసి..

చెరువు కట్ట తెగి 32 ఎకరాలలో ఇసుక మేట వేసిన ఘటన శివ్వంపేట మండలం రత్నాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గురువారం రాత్రి రత్నాపూర్‌ గ్రామంలోని అంబరెడ్డి చెరువు కట్ట తూము పక్కగా 50 మీ. పొడవునా తెగిపోయింది

Published : 13 Aug 2022 01:38 IST

అంబరెడ్డి చెరువులో నుంచి నీరు...

శివ్వంపేట, న్యూస్‌టుడే: చెరువు కట్ట తెగి 32 ఎకరాలలో ఇసుక మేట వేసిన ఘటన శివ్వంపేట మండలం రత్నాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గురువారం రాత్రి రత్నాపూర్‌ గ్రామంలోని అంబరెడ్డి చెరువు కట్ట తూము పక్కగా 50 మీ. పొడవునా తెగిపోయింది. దీంతో చెరువులోకి నీరంతా పక్కనే 210, 218 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి, పలువురి పొలాల్లోకి చేరింది. ఆ పొలాల్లో వరి సాగు చేయగా ఇసుక మేట వేసింది. వనరులోని నీరంతా ఖాళీ అయింది. ఇటీవలి వర్షాలకు చెరువు నీటితో కళకళలాడుతోంది. ఇక సాగుకు ఢోకా ఉండదని స్థానిక రైతులు సంబరపడ్డారు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఇక ఎలా సాగు చేయాలని, పొలంలో ఇసుక ఎలా తొలగించాలని ఆవేదనకు గురవుతున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న తహసీల్దారు శ్రీనివాసాచారి, ఆర్‌ఐ కిషన్‌, నీటిపారుదల శాఖ ఏఈ సునీత ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కట్ట తెగిపోవడం, నష్టం తీరుపై అంచనాలు వేసి పాలనాధికారి దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దారు తెలిపారు. మొత్తం 17 మందికి చెందిన 32 ఎకరాలలో ఇసుక మేట వేసిందని ఏఈవో మౌనిక చెప్పారు. కి.మీ. దూరంలోని అల్లీపూర్‌ చెరువులోకి అంబరెడ్డి చెరువు నీరంతా చేరింది. దీంతో అది ఖాళీ అయింది.
బుంగ ఏర్పడినా..
చెరువు ఆయకట్టు 50 ఎకరాలు. దీనికింద 100 ఎకరాలకు పైగా సాగు చేస్తుంటారు. 40 ఏళ్ల కిందట తొలిసారిగా కట్ట తెగిపోయింది. రెండో సారి 15 ఏళ్ల కిందట ఒకసారి కట్ట కోసుకుపోయింది. అప్పట్లో తెదేపా ప్రభుత్వ హయాంలో పనికి ఆహారం పథకం ద్వారా మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత మిషన్‌ కాకతీయ రెండో విడతలో రూ.15 లక్షలు వెచ్చించి కట్ట ఎత్తు పెంచి బలోపేతం చేయడంతో పాటు తూమును సైతం బాగు చేశారు. ఇప్పుడు మూడో సారి కట్ట తెగిపోయింది. చెరుకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరద అంతా చెరువు కట్టపై ప్రభావం చూపుతోంది. ఇటీవల బుంగ ఏర్పడగా.. ఎవరూ గమనించలేదు. రైతులూ అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. అది కాస్త పెద్దదవడంతో గురువారం రాత్రి ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహానికి కట్ట తెగిపోయింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని