logo

నిబంధనలకు దూరమై.. ప్రమాదాలకు చేరువై!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో డెక్కన్‌ మాల్‌, స్వప్నలోక్‌ దుకాణ సముదాయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది.

Published : 21 Mar 2023 05:24 IST

యథేచ్ఛగా పట్టణ యజమానుల ఉల్లంఘనలు !

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో డెక్కన్‌ మాల్‌, స్వప్నలోక్‌ దుకాణ సముదాయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. అయితే  చాలా పట్టణాలు, నగరాలు  పరిశీలిస్తే దుకాణ సముదాయాలో,్ల అపార్ట్‌మెంట్‌ నిర్మాణాల్లో అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టణీకరణ పెరిగి..బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. వీటిలో చాలా వరకు అగ్నిమాపక నిబంధనలకు దూరంగానే ఉన్నాయి.

మిర్యాలగూడ - సాగర్‌ ప్రధాన రహదారిపై కనీస స్థలం వదలకుండా నిర్మించిన
బహుళ అంతస్తుల దుకాణ సముదాయాలు


ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 320 వరకు ప్రైవేటు ఆసుపత్రులు , 250 వరకు బహుళ అంతస్తుల భవనాలు, 120కి పైగా వాణిజ్య సముదాయాలు, 21 వరకు సినిమా థియేటర్లు , వెయ్యికి పైగా ప్రైవేటు పాఠశాలలు, 280 వరకు బియ్యం మిల్లులు , 200 వరకు ఇతర పరిశ్రమలు ఉన్నాయి.

*    ప్రధానంగా మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, చిట్యాల, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. మిర్యాలగూడ, మఠంపల్లి, మేళ్లచెరువు ప్రాంతాల్లో బియ్యం, సిమెంటు పరిశ్రమలు, చౌటుప్పల్‌, బీబీనగర్‌ ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సైతం తరచూ అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మిర్యాలగూడ మండలంలోని పత్తిమిల్లులో ఏడాదిన్నర క్రితం అగ్నిప్రమాదం జరిగి రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లింది.

*    అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాల్సి ఉండగా.. యజమానులు మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించేస్తున్నారు. కాగితాలపైనే నిబంధనలు పాటిస్తున్నట్లుగా చూపుతూ పురపాలిక అనుమతులు పొందుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వెళ్లే స్థలం లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు.

*  నిర్మాణాలు పూర్తయిన భవనాలకు అగ్నిమాపకశాఖ ‘ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం’(ఎన్‌వోసీ) పొందటం లేదు. అగ్నినిరోధక పరికరాలు అమర్చటం లేదు. దీంతో ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఏర్పడుతోంది.

*    అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీ చేసిన సమయంలో నోటీసులు ఇస్తుండగా.. ఇవి అక్కడి వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. వాటిపై చర్యలు మాత్రం ఉండటం లేదు.


ఎన్‌వోసీ తప్పనిసరి

*    ఐదువందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనానికి అగ్నిమాపకశాఖ ఎన్‌వోసీ తప్పనిసరిగా ఇస్తేనే పురపాలికశాఖ అనుమతి జారీ చేయాల్సి ఉంది.

*   15 మీటర్లు ఎత్తు దాటిన భవనాలకు ప్రత్యేకంగా నీటి ట్యాంకును నిర్మించాలి. ప్రతి అంతస్తుకు అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనం పైపు అమర్చేలా గేట్‌వాల్వు ఏర్పాటు చేసి ఉంచాలి.

*    అగ్నినిరోధక పరికరాలతో పాటుగా ఫైర్‌ అలారం సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి.

*   బహుళ అంతస్తు భవనం కింద భాగంలో నీటిని నిల్వ చేసేందుకు సంపు నిర్మించి ఉంచాలి.

*   ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు గాను ప్రత్యేక ద్వారం నిర్మించాలి.

*    ఆసుపత్రులు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ చుట్టూ నాలుగువైపులా ఫైరింజన్‌ తిరిగేందుకు ఖాళీస్థలం ఉంచాలి.


సెట్‌బ్యాక్‌ లేక..

*   జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే సమయంలో సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించటం లేదు. అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు స్థలం సరిపడా ఉండటం లేదు.

*   దుకాణ సముదాయాలు, పాఠశాల భవనాల్లో కేవలం ఒకే మార్గం అందుబాటులో ఉంటుంది. రెండు మార్గాలు విధిగా ఉండాలన్న నిబంధన ఉన్నా.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం లేదు.  

*   నిరంతరం రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రుల్లో అగ్నిమాపక నిబంధనలే పాటించటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని