logo

‘మత్తు’కు కొత్త ఎత్తులు..!

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోంది. యువతే లక్ష్యంగా భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. పోలీసుల నిఘానూ లెక్కచేయకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవలీలగా కావాల్సిన మత్తును పొందుతున్నారు.

Updated : 16 Apr 2024 05:59 IST

పేటలో విచ్ఛలవిడిగా గంజాయి వినియోగం

సూర్యాపేట పట్టణం చర్చికాంపౌండ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే పనిగా గంజాయి విక్రయిస్తుండటంతో పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేశారు. అయినా ఆ వ్యాపారాన్ని మాత్రం విడిచి పెట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నెట్‌వర్క్‌కు ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే వ్యాపారంలో రూ.లక్షలు ఆర్జించి ఇటీవల సొంతంగా నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు. ఇతని కింద గంజాయి సరఫరా చేసే మరో 23 ఏళ్ల యువకుడు రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు.


సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన ఐదుగురు యువకులు నిత్యం గంజాయి మత్తులో తూగుతుంటారు. పాతికేళ్ల వయస్సులో ఉండే వీరిలో ఎవరి బరువూ నలభై కిలోలకు మించి ఉండదు. యుక్తవయస్సులోనే గంజాయి వ్యసనానికి బానిసలయ్యారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి గంజాయి తెచ్చి వినియోగించడంతోపాటు పలువురు యువకులకు విక్రయిస్తున్నారు. వీరిని పోలీసులు పలుమార్లు అదుపులోకి తీసుకున్నా.. ఏదో ఒక రకంగా బయటపడుతున్నారు. తిరిగి అదే వ్యసనంలో మునిగితేలుతున్నారు. రాయినిగూడెం కేంద్రంగా నిత్యం రాత్రి వేళల్లో వీరు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.


రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్‌) నిర్మూలనలో రాజీపడే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఆ మాటే వినపడకూడదు. యాంటీ నార్కోటిక్‌ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేసి, పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమిస్తాం. గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ సరఫరాను నియంత్రించి, రవాణా చేసే నిందితులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలి. తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది.. దేశానికి ఆదర్శంగా నిలపాలి.  

గత ఏడాది డిసెంబరు 10న అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం.


సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోంది. యువతే లక్ష్యంగా భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. పోలీసుల నిఘానూ లెక్కచేయకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవలీలగా కావాల్సిన మత్తును పొందుతున్నారు. ఐదేళ్ల క్రితం సూర్యాపేటలో ఒకే ఒక్క గంజాయి విక్రేత అందుబాటులో ఉండేవాడు.. ప్రస్తుతం ఈ సంఖ్య రెండు వందలకు చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి విక్రయిస్తూ లేదా వినియోగిస్తూ పట్టుబడిన పాత నేరస్థులు అలవాటుగా తిరిగి అదే ప్రవృత్తిలో కొనసాగుతుండటం గమనార్హం. వీరిపై నిఘా పెడితే గంజాయి వినియోగాన్ని కొంత మేర అడ్డుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పోలీసులు అటువైపుగా అడుగులు వేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  


సీలేరు నుంచి సూర్యాపేటకు..

పోలీసుల నిఘాను తప్పించుకొని గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. గతంలో పెద్దమొత్తంలో గంజాయిని ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి కార్లల్లో తరలించే వారు. ప్రస్తుతం పోలీసుల నిఘా పెరగడంతో ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారు. వినియోగదారులంతా కలిసి డబ్బు పోగుచేసుకొని, సమూహంగా ఏర్పడి నలుగురు యువకులను రెండు ద్విచక్ర వాహనాల్లో సీలేరు లేదా విశాఖపట్నం ప్రాంతానికి పంపిస్తున్నారు. గంజాయిని తక్కువ మోతాదులో కొనుగోలు చేసుకొని ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు బయలుదేరుతారు. మరో ఇద్దరు యువకులు వీరికి ఎస్కార్ట్‌ (రక్షణ)గా ముందు ఉంటారు. ఎక్కడైనా పోలీసుల తనిఖీలున్నట్లు గుర్తిస్తే వెంటనే చరవాణి ద్వారా సమచారం చేరవేస్తారు. వారు భద్రాచలం మీదుగా ఖమ్మం చేరుకొని దంతాలపల్లి నుంచి సూర్యాపేటకు చేరుకుంటున్నట్లు సమాచారం. మరికొంత మంది యువకులు హైదరాబాద్‌ ధూల్‌పేటపై ఆధారపడుతున్నారు. గంజాయిని కాగితంలో చుట్టగా చుట్టి వినియోగించేందుకు అవసరమైన ఓసీబీ పేపర్లనూ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తెలిసింది.


తల్లిదండ్రులపైన వేధింపులు

గంజాయి వ్యసనానికి బానిసలైన వారు వింత వింతగా ప్రవర్తిస్తూ సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కల్పిస్తున్నారు. రహదారులపై నడుచుకుంటూ వెళ్లే వారిపైనే కాకుండా ఇంట్లో తల్లిదండ్రులపైనా మత్తులో తమ ప్రతాపం చూపుతున్నారు. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి వారిపైనే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. మత్తులో వీరి చేష్టలకు విసిగి వేసారిన తల్లిదండ్రులు కన్న పిల్లలనే కడతేర్చిన ఘటనలూ జిల్లాలో ఉన్నాయి. కోదాడలో ఓ తల్లి గంజాయి వ్యసనానికి బానిసగా మారిన తన కుమారుడిని చేతులు, కాళ్లు కట్టేసి కంట్లో కారం కొట్టిన విషయం విదితమే. తిరుమలగిరి ప్రాంతంలో ఓ తల్లి ఏకంగా కుమారుడిని హతమార్చింది. పోలీసులు గంజాయి విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.


నిఘా పటిష్ఠం చేస్తాం

- రాజశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌, సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక బృందాన్ని నియమిస్తాం. పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నిత్యం ఐడీ పార్టీ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతోంది. సూర్యాపేట శివారు ప్రాంతాలతోపాటు 60 ఫీట్ల రోడ్డులోనూ ప్రత్యేక సిబ్బంది నియమించి తగిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు