logo

బస్తాలు రాక.. లక్ష్యం నెరవేరక..!

కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం తిరిగి ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు రైస్‌మిల్లులకు బస్తాల సమస్య నెలకొంది. ఖరీఫ్‌ ధాన్యంతో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బస్తాలకు కాప్రా పురుగు పట్టడంతో (సన్నని తెల్లపురుగు)..

Published : 17 Apr 2024 06:21 IST

మిర్యాలగూడలో ధాన్యం మిల్లులో కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం నిల్వలు తనిఖీ చేస్తున్న జిల్లా పౌరసరఫరాల అధికారుల బృందం (పాత చిత్రం)

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం తిరిగి ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు రైస్‌మిల్లులకు బస్తాల సమస్య నెలకొంది. ఖరీఫ్‌ ధాన్యంతో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బస్తాలకు కాప్రా పురుగు పట్టడంతో (సన్నని తెల్లపురుగు).. ఈ బస్తాల్లో కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని భారత ఆహార సంస్థకు లెవీ పెట్టేందుకు మిల్లర్లు ముందుకు రావటం లేదు. పురుగు వచ్చిన బస్తాల్లో భారత ఆహార సంస్థకు బియ్యాన్ని మిల్లర్లు పంపితే వారు వెంటనే తిరస్కరిస్తున్నారు.  

పంపిణీ విధానం ఇలా..

పౌరసరఫరాల శాఖ ఐకేపీ కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని 54 శాతం కొత్త బస్తాలు, 46 శాతం పాత బస్తాల్లో మిల్లులకు ధాన్యం లారీల్లో లోడు చేసి పంపుతున్నారు. ధాన్యం మరపట్టిన తరువాత లెవీగా భారత ఆహార సంస్థకు కొత్త బస్తాల్లో నింపి అందించాలి. కొత్త బస్తాలపై ఏసీకే నంబర్లు ముద్రించి మిల్లర్లు లెవీ పెట్టాల్సి ఉంది. గత ఖరీఫ్‌ ధాన్యం లెవీ పెట్టే విషయంలో జాప్యం అవుతుండగా ప్రస్తుతం ఈ బస్తాల్లో పురుగులు రావటంతో మిల్లర్లు సరఫరా చేయలేకపోతున్నారు. తమకు కొత్తగా బస్తాలు ఇవ్వాలంటూ జిల్లా పౌరసరఫరాల శాఖకు, కలెక్టర్‌కు వినతి పత్రాలు అందిస్తున్నారు. భారత ఆహార సంస్థ నుంచి లెవీకి అనుమతి వచ్చే విషయంలో జరుగుతున్న జాప్యంతో తమ వద్ద నిల్వ ఉంచిన ధాన్యం మిల్లింగ్‌కు కూడా పనికిరాకుండా పోతుందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి వచ్చిన సమయంలో బస్తాలు ఖాళీ చేసి ధాన్యం మిల్లింగ్‌ చేసి బియ్యం చేస్తున్నారు.


గతంలో కోటా ఇవ్వని వారికి కొత్త బస్తాలు..
- వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, నల్గొండ

ఖరీఫ్‌ ఐకేపీ ధాన్యం మిల్లులకు పంపిణీ చేసే సమయంలో 54 శాతం కొత్త బస్తాలు ఇవ్వని వారికి మాత్రమే కొత్త బస్తాలు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్‌ అనుమతించారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డీఎం పరిశీలించి కొత్త బస్తాలు ఇస్తున్నారు. అన్ని మిల్లులకు గతంలో పంపిన కొత్త బస్తాలను శుభ్రం చేయించి ఎఫ్‌సీఐకి లెవీ పెట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని