logo

ఇచ్చిన హామీలు అమలు చేస్తాం

భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని, భారాస, భాజపా అభ్యర్థులకు తమకు పోటీయే కాదని కాంగ్రెస్‌ భువనగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 17 Apr 2024 06:25 IST

భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిత్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి గంజ్‌, న్యూస్‌టుడే: భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని, భారాస, భాజపా అభ్యర్థులకు తమకు పోటీయే కాదని కాంగ్రెస్‌ భువనగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. భువనగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని స్థానిక శాసనసభ్యుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం భువనగిరిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజగోపాల్‌రెడ్డితో పాటు, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి హాజరయ్యారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల భారాస ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, అవినీతికి పాల్పడిన కేసీఆర్‌,  ఆయన కుటుంబ సభ్యులతో పాటు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి భువనగిరి శాసనసభా స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించారని, అదే స్ఫూర్తితో చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీ సాధించేలా కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారని,  ఎంపీ టికెట్‌ ఇచ్చేదిలేదని స్పష్టం చేయడంతో విరమించుకుని భారాసలో కొనసాగుతున్నారన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు శాసనసభా ఎన్నికలకు సమష్టిగా పనిచేసినట్లే ఎంపీ ఎన్నికల్లోనూ పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితో భువనగిరిలో గెలిచి చరిత్ర సృష్టించామన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ భారాసను ఓడించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదలను, పార్లమెంట్‌ ఎన్నికల్లో చూపించాలని కోరారు. సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, పురపాలిక అధ్యక్షుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పీసీపీ డెలిగేట్‌ తంగళ్లపల్లి రవికుమార్‌, పీసీపీ కార్యదర్శులు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కసుభ శ్రీనివాసరావు, నాయకులు పచ్చిమట్ల శివరాజుగౌడ్‌, సామ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బర్రె జహంగీర్‌, కైలాశ్‌నేత, రామాంజనేయులుగౌడ్‌, సురభి, పద్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు