logo

కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం

వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది.

Updated : 18 Apr 2024 05:54 IST

నాంపల్లి: మరుగుదొడ్డిలో నివసిస్తున్న వృద్ధురాలు పల్లేటి భారతమ్మ

నాంపల్లి, న్యూస్‌టుడే: వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. పొట్ట నింపేందుకు పనికెళ్లాలనుకున్నా వయసు సహకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పింఛను.. ఆ అమ్మకు ఆసరాగా మారింది. స్వచ్ఛభారత్‌ కింద నిర్మాణం చేసిన మరుగుదొడ్డి ఆమెకు నివాసమైంది.మండలంలోని కేతెపల్లి గ్రామానికి చెందిన పల్లేటి భారతమ్మది నిరుపేద కుటుంబం. పూరిగుడిసెలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించింది. పూరిగుడిసె కాస్తా మూడేళ్ల క్రితమే పూర్తిగా దెబ్బతింది. నివాసముంటున్న పూరిగుడిసెలో ఆమె విద్యుదాఘాతానికి గురి కావడంతో కూలిపనులకు వెళ్లడం కష్టంగా మారింది. గూడు చెదిరిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొన్ని రోజులు ఆమె కూతురు వద్ద నివసించింది. కూతుళ్లకు భారం కావొద్దని ప్రస్తుతం రేషన్‌ సరుకులు, ఆసరా పింఛన్‌తో గ్రామంలోనే ఉంటోంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్డిలో వంట చేసుకుంటూ.. ఆరు బయట నిద్రిస్తూ కాలం వెళ్లదీస్తోంది. వర్షాకాలంలో మూడడుగుల మరుగుదొడ్డిలోనే కాళ్లు ముడుచుకొని కంటినిద్రలేక గడపాల్సి వస్తోందని కన్నీటిపర్యంతం అవుతోంది. ప్రభుత్వం కనికరించి తనకు గూడు కట్టివ్వాలని దీనంగా వేడుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని