logo

నేడే విడుదల రంగం

లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి

Updated : 18 Apr 2024 05:40 IST

రెండు లోక్‌సభ స్థానాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం

ఈనాడు, నల్గొండ : లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. నల్గొండ లోక్‌సభ స్థానానికి సంబంధించి నల్గొండ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) కార్యాలయంలో, భువనగిరి స్థానానికి భువనగిరి కలెక్టరేట్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నల్గొండ ఆర్వోగా వ్యవహరిస్తున్న కలెక్టరు దాసరి హరిచందన, భువనగిరి ఆర్వోగా ఉన్న స్థానిక కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ సెలవు దినాలు, ప్రత్యేక రోజుల్లో మినహాయించి ఈ నెల 25వ తేదీ వరకు సాధారణ రోజుల్లో రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల క్రతువు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మంచి రోజులు చూసుకొని భారీ ర్యాలీలు, సభలతో నామినేషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు పోలింగ్‌ మే 13న జరగనున్న సంగతి తెలిసిందే.

నామినేషన్ల అనంతరం ముమ్మర ప్రచారం  

నామినేషన్ల క్రతువు ప్రారంభం కానుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపా ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భారాస అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశాలు తుది దశకు చేరాయి. ఈ నెల 25 వరకు నామినేషన్‌ల కార్యక్రమం ఉన్నందునా ఆ లోపు మిగిలిన సెగ్మెంట్లలో సమావేశాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అనంతరం మండలాల వారీగా సమావేశాలు, ముఖ్య కార్యకర్తలతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించాయి. నల్గొండలో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ఈ నెల 24న నల్గొండలో భారీ సభను ఏర్పాటు చేసి అదే రోజు నామినేషన్‌ వేయనున్నారు. కార్యక్రమానికి మంత్రి, నల్గొండ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటూ మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి  హాజరుకానున్నారు. భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 22న నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్‌ ఈ నెల 22, 23 తేదీల్లో నామినేషన్‌ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి నల్గొండలో, హరీశ్‌రావు భువనగిరిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
  • భాజపా నల్గొండ, భువనగిరి అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌ ఈ నెల 22, 23 తేదీల్లో నామపత్రాలను దాఖలు చేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ డా.లక్ష్మణ్‌లో ఎవరో ఒకరు నల్గొండలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, భువనగిరిలో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాష్ట్రంలో భువనగిరి స్థానంలోనే పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. భువనగిరిలో ఆయన ఈ నెల 19న నామినేషన్‌ వేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరుకానున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని