logo

Nizamabad: అమ్మలా.. మరెవరికి కావొద్దని

‘అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లికి అంబులెన్సు సౌకర్యం అప్పటికప్పుడు అందుబాటులో లేక చికిత్స నిమిత్తం పట్నం తీసుకెళ్లడానికి నానాకష్టాలు పడ్డారు. వ్యయప్రయాసలకు ఓర్చి ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.

Updated : 14 Feb 2024 08:51 IST

ఉచిత అంబులెన్సు సేవలు అందిస్తున్న బీబీపేటవాసి

న్యూస్‌టుడే, బీబీపేట(కామారెడ్డి): ‘అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లికి అంబులెన్సు సౌకర్యం అప్పటికప్పుడు అందుబాటులో లేక చికిత్స నిమిత్తం పట్నం తీసుకెళ్లడానికి నానాకష్టాలు పడ్డారు. వ్యయప్రయాసలకు ఓర్చి ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. తన తల్లి మరణం కలిచివేయడంతో.. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు’ అని నిర్ణయించుకుని తన తల్లి సువర్ణమ్మ జ్ఞాపకార్థం రూ.12 లక్షల సొంత ఖర్చుతో అంబులెన్సునే కొనుగోలు చేశారు  కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన డా.ఎం.పెరుమాండ్లు. 2009 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్‌ను స్థాపించి ఎంతో మందికి సేవలందిస్తున్నారు.

268 రోజులు..120 మంది తరలింపు

2023 మే 22వ తేదీన మండల ప్రజలతో కలిసి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంబులెన్స్‌ సేవలను ప్రారంభించారు. మండలం, సమీప ప్రజలు అత్యవసరం వేళ 108 కంటే ఈ అంబులెన్స్‌నే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 268 రోజుల్లోనే 120 మందిని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కాల్‌ చేసిన 10 నిమిషాల్లోనే అంబులెన్సు ప్రమాదస్థలానికి చేరుకుంటోంది. ఈ వాహనం నిర్వహణ, పనిచేసే వారి జీతాలు కలిపి నెలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసి ఉచితంగా సేవలందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంబులెన్సు ద్వారా రామాయంపేట, కామారెడ్డి, సిద్దిపేట, ఎల్లారెడ్డిపేట, హైదరాబాద్‌, దుబ్బాక తదితర పట్టణాల్లోని ఆసుపత్రులకు రోగులను, క్షతగాత్రులను తీసుకెళ్తున్నారు.


అత్యవసరాలకు వినియోగించుకోండి

- డా.ఎం.పెరుమాండ్లు, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు

అంబులెన్సును అత్యవసర సేవల సమయంలోనే వినియోగించుకోవాలి. మా సిబ్బందిని తప్పుదోవ పట్టించకూడదు. కేవలం బీబీపేట మండలమే కాకుండా ఆరోజు అంబులెన్సు ఖాళీగా ఉందంటే దగ్గరగా ఉన్న ఇతర మండలాలు(నిజాంపేట, దుబ్బాక, గంభీరావుపేట, దోమకొండ, భిక్కనూరు) నుంచి ఏదైనా అత్యవసర సమయాల్లో ఫోను వచ్చినా.. మా అంబులెన్స్‌ మీ దగ్గరకు వస్తుంది.  మా అంబులెన్స్‌ నంబరు 90002 33396

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని