logo

ఈసారైనా మోక్షం లభించేనా?

బోధన్‌ - బీదర్‌ రైల్వేలైన్‌పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్‌ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు.

Updated : 18 Apr 2024 06:27 IST

అభ్యర్థుల ప్రచారంలో బోధన్‌ - బీదర్‌ రైల్వేలైన్‌ హామీ
న్యూస్‌టుడే, బాన్సువాడ

బాన్సువాడ ప్రాంతంలో గతంలో జరిగిన సర్వేలో భాగంగా పాతిన హద్దురాయి

బోధన్‌ - బీదర్‌ రైల్వేలైన్‌పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్‌ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ లైన్‌కు మోక్షం లభించడం లేదు. నిధులు మంజూరైతే వెనుకబడిన ప్రాంతాలైన బాన్సువాడ, జుక్కల్‌, నారాయణఖేడ్‌ తదితర నియోజకవర్గ ప్రజలకు ఎంతోమేలు జరిగే అవకాశం ఉంది. రైల్వేలైన్‌ ఏర్పాటుతో పరిశ్రమలు రావడంతో పాటు కొంతమేర నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది. పాలకులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

గతంలో సర్వే పూర్తి..

బోధన్‌ - బీదర్‌ వరకు 138 కి.మీ ఉంటుంది. రైల్వేలైన్‌ ఏర్పాటుకు 2010లో నిధులు కేటాయించడంతో సర్వే పూర్తి చేశారు. అనంతరం ప్రతి బడ్జెట్‌లోనూ లైన్‌ ఊసేలేకుండా పోయింది. బోధన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రుద్రూర్‌, వర్ని, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్‌ మీదుగా బీదర్‌ వరకు సర్వే చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అవుతోంది. ఈ ప్రాంతం నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. లైన్‌తో వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.

మరోసారి తెరపైకి..

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల హామీలతో మరోసారి రైల్వేలైన్‌ ఏర్పాటు తెరపైకి వచ్చింది. పోటీల్లో నిలిచిన అభ్యర్థులు తమ తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రైల్వేలైన్‌ తీసుకొస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌, భారాస, భాజపా అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో రైల్వేలైన్‌తో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు. గెలిచిన అభ్యర్థి ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్లనాటి కలను తీరుస్తారా? లేదా హామీకే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాలి. ప్రజలు మాత్రం రైల్వేలైన్‌ కావాలని బలంగా కోరుకుంటున్నారు. సర్వేలకే పరిమితం కాకుండా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని