logo

పర్యవేక్షిస్తేనే ఆదాయం

బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు.

Updated : 24 Apr 2024 06:46 IST

విచ్చలవిడిగా ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు
మూడున్నరేళ్లలో 232 దరఖాస్తులే

కామారెడ్డిలో అనుమతి లేకుండా వేసిన ప్రచార పత్రాన్ని తొలగిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లా కేంద్రంతో పాటు మిగతా బాన్సువాడ, ఎల్లారెడ్డి బల్దియాల ఖజానాకు గండి పడుతోంది. మూడున్నరేళ్లలో 300 దరఖాస్తులు దాటలేదు. ఏప్రిల్‌ 20వ తేదీ వరకు 232 దరఖాస్తులే రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పురపాలికల్లో కార్మికులకు కనీసం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. వారి ఖాతాలో పీఎఫ్‌, ఈఎస్‌ఐ జమ చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అనధికారిక ప్రకటనల జోరు..

జిల్లాలోని పురపాలికల్లో అనధికారిక ప్రకటనల జోరు కొనసాగుతోంది. ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడం, జన్మదిన వేడుకలకు భారీ ఫ్లెక్సీలు కట్టడం, రాకపోకలకు అంతరాయం కలిగేలా బోర్డులు పాతడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. విద్యుత్తు స్తంభాలకు చిన్న పరిమాణంలో ఉన్న ఫ్లెక్సీలను కడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిర్ణీత రోజుల వరకు మాత్రమే అక్కడ ఉంచాలి. గడువు ముగిసినా బల్దియా సిబ్బంది వాటిని తొలగించడంలేదు. పట్టణాల్లో ఏర్పాటు చేసే రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, ఇతర వాణిజ్య ప్రకటనల బోర్డులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అధికారులకు స్పష్టత కరవైంది. బడ్జెట్‌లో జిల్లాలోని పురపాలికల్లో రూ.40 లక్షల ఆదాయం అంచనా వేయగా.. రూ.8 లక్షలు కూడా దాటడం లేదు. ఈ పన్ను సక్రమంగా వసూలు కాకపోవడంతో బల్దియాలు రూ.లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. అనుమతులు లేకుండా ప్రచార ప్రకటనలు ఏర్పాటు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి బల్దియా టీపీవో గిరిధర్‌ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. లేదంటే వాటిని తొలగిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని