logo

వరికే ప్రాధాన్యం

రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Updated : 24 Apr 2024 06:42 IST

5.52 లక్షల ఎకరాల్లో పంటలు
వానాకాలం ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయశాఖ
 

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతేడాది సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ సారి ఏ పంట ఏ మేరకు సాగవుతుందనే దానిపై తాజాగా జిల్లా వ్యవసాయశాఖ వానాకాలం ప్రణాళిక విడుదల చేసింది. ఏయే పంటలకు ఎన్ని విత్తనాలు, ఎరువులు అవసరమో ప్రతిపాదనలు తయారు చేసినట్లు వెల్లడించింది.

గతేడాది కంటే మెరుగ్గానే..

2023 వానాకాలం కంటే ఈ సారి కాస్త సాగు పెరుగుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వానాకాలంంలో అత్యధికంగా వరికే రైతులు ప్రాధాన్యం ఇస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తం సాగులో ఇది ఒక్కటే 78 శాతం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు 1,29,165 క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రతిపాదించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌) వద్ద అవసరమైన నిల్వలున్నట్లు గుర్తించారు. అలాగే ప్రైవేటు విత్తన కంపెనీలు సైతం సరిపడా ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

ఆరుతడి అంతంతే!

జిల్లావ్యాప్తంగా ఆరుతడి పంటల సాగు అంతంతే ఉండబోతుందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌లో పసుపు, సోయా, మొక్కజొన్న పంటలకు మంచి గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా సాగు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పత్తి, పప్పుదినుసులు నామమాత్రంగానే వేయనున్నారు. నీటి వనరులు సరిపోకుంటేనే ఆరుతడి పెరిగే వీలుంటుంది. గతంలో లక్షల ఎకరాల్లో సాగయ్యే సోయాబీన్‌ 50 వేల ఎకరాలకు మించే పరిస్థితి లేదు. మక్క 42 వేల ఎకరాలు, పసుపు 20 వేల ఎకరాలకే పరిమితమవుతుందని భావిస్తున్నారు.

పచ్చిరొట్ట ఎరువులకు ప్రతిపాదన

వానాకాలంలో 1.33 లక్షల ఎకరాలకు 16 వేల క్వింటాళ్లు, జనుము 1,562 ఎకరాలకు 250 క్వింటాళ్ల విత్తనం సమకూర్చాలని చూస్తున్నారు. వీటిని టీఎస్‌ సీడ్స్‌ ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 15,443 క్వింటాళ్ల సోయా విత్తనం కావాల్సి ఉంది. ఈ సారి కూడా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడాల్సిందే.

ఇబ్బందులు లేకుండా చర్యలు

వాజీద్‌ హుస్సేన్‌, జిల్లా వ్యవసాయాధికారి

వచ్చే వానల ఆధారంగానే సాగు విస్తీర్ణం ఉంటుంది. ఈసారి గత వానాకాలం మాదిరిగానే సేద్యం ఉంటుంది. అందుకు సరిపడా విత్తనాలు, ఎరువుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్‌లోకి రాకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. సీజన్‌ ప్రారంభం కాగానే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని