logo

తాగునీటికి కటకట!

గజపతి జిల్లాలో కొన్ని గ్రామాలు గుక్కెడు నీటికి కటకటలాడుతున్నాయి.

Published : 16 Apr 2024 03:57 IST

బిందెలతో నీళ్లు తీసుకొస్తున్న మహిళలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో కొన్ని గ్రామాలు గుక్కెడు నీటికి కటకటలాడుతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి మంచి నీటిని తెచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ‘వసుధ పథకం’ కింద అందరికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చించినా.. పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. జిల్లాలోని గుమ్మ సమితి బుబని పంచాయతీకి 12 కిలోమీటర్ల దూరంలో కింగ్‌డాంగ్‌ గ్రామం ఉంది.  ఈ ఊరిలో నివసిస్తున్న 32 కుటుంబాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. బోరుబావులు, రక్షిత నీటి పథకాలు గ్రామంలో లేకపోవడంతో అర కిలోమీటర్‌ దూరంలో ఉన్న బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. వేసవి తాపానికి చెరువులు అడుగంటి పోవడంతో కింగ్‌డాంగ్‌ గ్రామస్థులు శివారున ఉన్న రాతిబావికి పరిమితమయ్యారు. మరికొన్ని చోట్ల ఉన్న బావులు ఇంకిపోతున్నాయని నీటి కోసం అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

రాళ్లు దేరిన రహదారి: సుమారు పంచాయతీ నుంచి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లుదేరిన రహదారి దర్శనమిస్తుంది. ఈ మార్గం మీదుగా గుమ్మ, సెరంగో, నువాగడ, రాయగడల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దీనిపై పలుమార్లు అధికారులకు , ప్రజాప్రతినిదులకు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్థులు అంటున్నారు.

వార్డు మెంబర్‌ తిలాష్‌మండల్‌ తమ గ్రామానికి తాగునీటి సదుపాయం, రహదారి నిర్మించాలని పలుమార్లు స్పందన కార్యక్రమంలో వినతులు సమర్పించినప్పటికీ అధికారులు తమ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారని, ఇప్పటికైనా దృష్టి సారించాలని కోరారు.

పరిష్కరిస్తాం: ఈ విషయమై గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాజేష్‌ కుమార్‌ ఘరానాయక్‌కి ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని