logo

‘ఈ-శ్రమ్‌’ కార్డులు పొందొచ్చిలా!

వివిధ రంగాల్లోని అసంఘటిత కార్మికుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఈ-శ్రమ్‌ కార్డుల దరఖాస్తుకు కేంద్రం ఇంకా అవకాశం ఇచ్చింది. జిల్లాలో కార్మికులు దాదాపు 12,86,434 మంది ఉండగా 1,78,124 మంది పేర్లు

Published : 22 Jan 2022 02:48 IST

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే

రోడ్డుపై ఈ- శ్రమ్‌ కార్డులకు వివరాలు తీసుకుంటూ...

వివిధ రంగాల్లోని అసంఘటిత కార్మికుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఈ-శ్రమ్‌ కార్డుల దరఖాస్తుకు కేంద్రం ఇంకా అవకాశం ఇచ్చింది. జిల్లాలో కార్మికులు దాదాపు 12,86,434 మంది ఉండగా 1,78,124 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. తొలుత గడువు గత డిసెంబరు 31తో ముగిసినా...ఇంకా అవకాశం ఉందని కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదిగో ఇలా●

* అర్హులు: 16 నుంచి 59 సంవత్సరాల వయస్సున్నవారు

* ఎవరు: భవన నిర్మాణ కార్మికులు, దుకాణాలు, సంస్థలు, షోరూంలలో, హోటళ్లలో, ఇళ్లల్లో పనిచేసేవారు, ఆటో రిక్షా కార్మికులు, కొరియర్‌ బాయ్స్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేసేవారు, రంగులు వేసేవారు, టీ దుకాణాలు నడిపేవారు, మత్స్యకారులు...ప్రభుత్వం పేర్కొన్న మరికొందరు( ఇ.ఎస్‌.ఐ., పి.ఎఫ్‌. సదుపాయం లేనివారు).

* ప్రయోజనం: ఏదైనా ప్రమాదంలో మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. లక్ష కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.

* నమోదుకు వెబ్‌సెట్‌కు: regsiter.eshram.gov.in

* కావల్సిన పత్రాలు: ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్‌ నంబర్లు

* ఎక్కడెక్కడ నమోదు చేసుకోవచ్చు: వ్యక్తి గతంగా ఎవరికి వారే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్ఛు ఒకవేళ అలా చేసుకోలేనివారు పబ్లిక్‌ సర్వీస్‌ సెంటర్లు (సి.ఎస్‌.సి.), తపాలా కార్యాలయాలు, కార్మికశాఖ కార్యాలయంలోనూ నమోదు చేసుకోవచ్ఛు ఇందుకు ఎటువంటి రుసుం చెల్లించక్కర్లేదని, కార్డు వచ్చిన తర్వాత లామినేషన్‌ చేసి ఇచ్చినందుకు ఖర్చు కింద రూ.16ల మాత్రమే ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు.

కొందరి తీరు ఇలా

కొంతమంది నగరంలోని పలు చోట్ల వీధుల్లో బెంచీలు వేసుకొని ఈ-శ్రమ్‌ కార్డులు నమోదు చేస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. ఉచితంగా చేయాల్సిన వీటికి...వంద నుంచి రూ.150ల వరకు వసూలు చేస్తున్నారు. అదే తక్కువ ధరని చెబుతున్నారు. విషయం తెలియని చాలా మంది సొమ్ములు చెల్లించుకుంటున్నారు. ఇలా చేయడం చాలా తప్పు అని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం.సునీత పేర్కొంటున్నారు. అలాంటి అక్రమాలకు పాల్పడితే మాత్రం సి.ఎస్‌.సి. కేంద్రాల జిల్లా మేనేజర్‌ సంతోష్‌ దృష్టికి తేవచ్చని ఆమె పేర్కొన్నారు. ‘ఈ -శ్రమ్‌ కార్డులు పొందిన వారి ఖాతాల్లో కేంద్రం నెలకు రూ.500ల చొప్పున రెండు నెలల పాటు జమ చేస్తుంది. కార్డు అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతాలో రూ. వెయ్యి జమవుతాయి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని