logo

వన్యప్రాణులకు పెట్టిన ఉచ్చుకే చిక్కాడు!

వన్యప్రాణుల వేటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో నేల బావిలో శవమై తేలిన యువకుడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని ఆదివారం అరెస్టు చూపారు. కోటవురట్ల పోలీసు స్టేషన్‌లో నర్సీపట్నం గ్రామీణ సీఐ సీఐ

Published : 24 Jan 2022 01:38 IST

 పందూరు యువకుడి మృతి కేసులో వీడిన మిస్టరీ

నిందితులతో సీఐ శ్రీనివాసరావు

కోటవురట్ల, న్యూస్‌టుడే: వన్యప్రాణుల వేటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో నేల బావిలో శవమై తేలిన యువకుడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని ఆదివారం అరెస్టు చూపారు. కోటవురట్ల పోలీసు స్టేషన్‌లో నర్సీపట్నం గ్రామీణ సీఐ సీఐ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని పందూరుకు చెందిన మల్లవరపు నవీన్‌ (19) ఈ నెల 6న అదే గ్రామానికి చెందిన కాండ్రకోట సత్యనారాయణ, రాజుతో కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లాడు. అతడితో వేటకు వెళ్లిన ఇద్దరూ అదే రోజు సాయంత్రం ఇళ్లకు చేరుకోగా.. నవీన్‌ రాలేదు. దీంతో అతడి సోదరులు గాలించగా.. రెండు రోజుల తర్వాత పొలాల్లోని నేలబావిలో నవీన్‌ మృతదేహం బయటపడింది. మెడకు ఇనుప తీగతో బండరాయి కట్టి ఉండటంతో హత్య చేసి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. విచారణలో భాగంగా సత్యనారాయణ, రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు రాకపోవడంతో పందూరు పరిసర గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడే వారిపై పోలీసులు దృష్టిసారించారు. పలువుర్ని స్టేషన్‌కు పిలిచి విచారించారు. అడవి పందులను వేటాడేందుకు ఏర్పాటు చేసే విద్యుత్తు కంచె తగిలి నవీన్‌ మృతి చెందాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నవీన్‌, సత్యనారాయణ, రాజు వేటకు వెళ్లడానికి ముందు రోజు పందూరుకు గ్రామానికి చెందిన ఏలేశ్వరం ఈశ్వరరావు, కైలాసపట్నంకు చెందిన వంతర కళ్యాణం, చిటికెల నూకరాజు అడవి పందుల కోసం పొలం చుట్టూ విద్యుత్తు తీగలతో ఉచ్చును ఏర్పాటు చేశారు. వేటకు వెళ్లిన నవీన్‌ ఆ ఉచ్చుకు చిక్కి మృతి చెందాడు. ఉచ్చు పెట్టిన ఈశ్వరరావు, కళ్యాణం, నూకరావు ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో తీగను నవీన్‌ మెడకు చుట్టి, బండరాయి కట్టి బావిలో పడేశారు. నిందితుల వద్ద నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని