logo

నకిలీ అధికారుల హల్‌చల్‌

సివిల్‌ సప్లై అధికారులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు హోటళ్ల మీద దాడిచేసి డబ్బులు కాజేస్తుండగా.. కొందరు అప్రమత్తమై ఎంవీపీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 29 May 2022 04:38 IST


ఓ హోటల్‌లో కూర్చున్న నకిలీ అధికారి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : సివిల్‌ సప్లై అధికారులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు హోటళ్ల మీద దాడిచేసి డబ్బులు కాజేస్తుండగా.. కొందరు అప్రమత్తమై ఎంవీపీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవాల్తేరులోని ఓ హోటల్‌కు శనివారం శ్రీనివాస్‌, చక్రవర్తి అనే ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. సివిల్‌ సప్లై అధికారులమని చెప్పి తనిఖీలు నిర్వహించారు. ఆ హోటల్‌లో గృహ వినియోగ గ్యాస్‌ వాడుతుండటంతో జరిమానా కట్టాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే గతంలో పెదవాల్తేరులోని ఓ హోటల్లో నకిలీ అధికారులు ఇలాగే దాడులు నిర్వహించి రూ.7 వేలు వసూలు చేశారు. ఆ హోటల్‌ బాధితుడు ప్రస్తుతం జరుగుతున్న దాడుల గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి పరిశీలించగా.. నకిలీలని తేలింది. ఈలోపు వచ్చిన వారిలో శ్రీనివాస్‌ కారులో పారిపోయాడు. చక్రవర్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.

‘వారితో జాగ్రత్త సుమా..’

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పౌరసరఫరాల శాఖ అధికారుల పేరుతో తనిఖీలకు వచ్చే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌ఒ) జి.సూర్యప్రకాశరావు సూచించారు. ఇటీవల పలు హోటళ్లలో గృహ వినియోగ వంటగ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తాము దాడులు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో శనివారం ఓ వ్యక్తి తమ శాఖ అధికారుల పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. తమ శాఖ పేరు చెప్పుకొని తనిఖీలకు వచ్చే వారిని ముందస్తుగా గుర్తింపు కార్డులు అడగాలని, అవి లేకుంటే నకిలీ అధికారులుగా గుర్తించాలని సూచించారు. ఇంకా అనుమానాలు ఉంటే 80083 01534 నెంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని