logo

లబ్ధిదారుల నెత్తిన ధరా భారం

ఆనందపురం: ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జగనన్న కాలనీల్లో మొదటి విడతగా ప్రారంభించిన గృహాల నిర్మాణాలు కొన్నిచోట్లే వేగంగా పూర్తవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపు కావడంతో లబ్ధిదారులకు దిక్కుతోచడం లేదు. కొంద

Published : 28 Jun 2022 06:32 IST

ఇళ్ల నిర్మాణాలకు అష్టకష్టాలు


పెద్దిపాలెం వద్ద కొన్ని నిర్మాణాలు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఆనందపురం: ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జగనన్న కాలనీల్లో మొదటి విడతగా ప్రారంభించిన గృహాల నిర్మాణాలు కొన్నిచోట్లే వేగంగా పూర్తవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపు కావడంతో లబ్ధిదారులకు దిక్కుతోచడం లేదు. కొందరు వచ్చినా సగసగం చేసి మధ్యలో వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు తక్కువ అవ్వడం ధరలు

నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోతుండటతో గృహ నిర్మాణాలకు జంకుతున్నారు. ప్రభుత్వం పావలా వడ్డీ కింద రూ.35 వేల రుణం ఇప్పిస్తామని చెప్పినప్పటికీ అది కొందరికి మాత్రమే అందింది. క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసిన వారికి ఒక్కో ఇంటికి రూ.7 లక్షలకు పైగానే ఖర్చయిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. కూలీల ఖర్చు మొదలుకొని ఇటుకలు, ఇసుక రవాణా వంటి వాటితో అదనపు ఖర్చులు పెరిగిపోయాయంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.

ఆనందపురం మండలం పెద్దిపాలెం పంచాయతీ లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌లో పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం , విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలి. ఇందులో 148 ఇళ్లు కట్టాల్సి ఉంది. ఇక్కడ పూర్తయినవి నాలుగు. గోడల వరకు అయినవి 20. పునాదుల వరకు అయినవి 20. దాదాపు 15 వరకు మధ్యలో ఉండిపోయాయి. మిగిలిన వారు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ స్థలాలు కొండ వాలు ప్రాంతంలో ఉండటంతో పునాదుల తవ్వడానికి యంత్రాలను వినియోగిస్తున్నారు. ఫలితంగా అదనపు ఖర్చు అవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్న ఓ లబ్ధిదారు మాట్లాడుతూ.. మౌలిక వసతులు త్వరితగతిన కల్పించాలన్నారు.

భీమిలి మండలం తాటితూరు రెవెన్యూలో గ్రామస్థులకు 300 వరకు ఇళ్లు కేటాయించారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు ప్రారంభంకాలేదు. స్థలాలు కేటాయించిన కొండను చదును చేసి వదిలేశారు.

ఆనందపురం మండలంలో ఎల్వీపాలెం, పొడుగుపాలెం, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో లేఅవుట్లలో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ 200 ఇళ్లు కేటయించారు.. తహసీల్దార్‌ కార్యాలయం వెనుకున్న లేఅవుట్‌లో దాదాపు నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు గోడలు, పైకప్పు వరకు గృహాలు నిర్మించారు. కొండ ప్రాంతం కావడంతో పునాదుల తవ్వకానికి అదనపు ఖర్చు అవుతోందంటున్నారు. సిమెంటు, ఇసుక రవాణాకు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. పూర్తిస్థాయిలో మౌలికవసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. విద్యుత్తు సౌకర్యం, కొండ మీద నీటి వసతి పెంచాలంటున్నారు. రోడ్లు, కాలువలు తవ్వాల్సి ఉంది. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో కేటాయించిన 140 ఇళ్లకు రెండే బోర్లు తవ్వారు. శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గొట్టాలు అమర్చుకొని పనులు చేస్తున్నారు.

ఖర్చు రెండింతలు పెరిగింది: 

భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి నిర్మాణం విలువ అమాంతం పెరిగిపోయింది. ఇల్లు ప్రారంభించిన సమయంలో 4 వేల ఇటుక రూ.18 వేలుంటే ఇపుడు రూ.28 వేలు అయింది. కూలీల ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇక్కడ ఇంటిని మేస్త్రి గతంలో రూ.1.60 లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. ఇప్పుడు రూ.2.60 లక్షలు అడుగుతున్నారు. దీనికి సామగ్రి కొనుగోళ్లు అదనం. ప్రభుత్వం ఇచ్చిన సాయం సరిపోకపోవడంతో అప్పు చేసి నిర్మాణం పూర్తిచేస్తున్నాం. - ప్రసాద్‌, పొడుగుపాలెం

విద్యుత్తు సౌకర్యం కల్పించాలి: 

మా ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. బిల్లు అయినంత వరకు చెల్లించేశారు. ఇక్కడ లేఅవుట్‌లో పూర్తిస్థాయి విద్యుత్తు సౌకర్యం కల్పించాలి. రోడ్లు, కాలువలు త్వరితగతిన నిర్మిస్తే ఇంటిలో దిగిపోతాం. తగిన వసతులు వెంటనే కల్పించాలి. - లలిత, ఆనందపురం

నీరు కొనుక్కున్నాం: 

ఈ లేఅవుట్‌లో మొదట ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయానికి అధికారులు బోర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ట్యాంకులతో నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసమే సుమారు రూ.50 వేల వరకు అదనంగా ఖర్చయిపోయింది. ఆ తరువాత బోరు ఏర్పాటు చేశారు. కూలీల ఖర్చులు పెరగడంతో మధ్యలో మూడు నెలలు పనులు ఆపేశాం. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేశాం. రూ.9 లక్షల వరకు ఖర్చయింది. అప్పు చేసి నిర్మించాం. - సింహాచలం, పెద్దిపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని