logo

Vizag news : హంగుల్లేని బీచ్‌లు!!

విశాఖ జిల్లాలోని తీరంలో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. ఈ పరిస్థితి చూసి నగరానికి వచ్చే పర్యాటకులు అవాక్కవుతున్నారు. రుషికొండలో తప్ప మరెక్కడా పూర్తిస్థాయి వసతులు లేవు. కొన్ని బీచుల్లో కనీసం దాహార్తి తీర్చుకునేందుకు తాగునీరైనా అందుబాటులో ఉండడం లేదు.

Updated : 07 Aug 2022 08:38 IST

ప్రతిపాదనల్లోనే అభివృద్ధి ప్రణాళికలు

ఈనాడు, విశాఖపట్నం

సాగర్‌నగర్‌ వద్ద అధ్వాన పరిస్థితి

విశాఖ జిల్లాలోని తీరంలో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. ఈ పరిస్థితి చూసి నగరానికి వచ్చే పర్యాటకులు అవాక్కవుతున్నారు. రుషికొండలో తప్ప మరెక్కడా పూర్తిస్థాయి వసతులు లేవు. కొన్ని బీచుల్లో కనీసం దాహార్తి తీర్చుకునేందుకు తాగునీరైనా అందుబాటులో ఉండడం లేదు.

పరిశుభ్ర పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, ఝార్ఖంఢ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు విశాఖకు వస్తారు. వారాంతాల్లో వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యధికులు రామకృష్ణబీచ్‌, రుషికొండకు, మరికొందరు యారాడ తీరానికి వెళ్తారు. నగరానికి సమీపంలో మరికొన్ని బీచ్‌లు ఉన్నా అవన్నీ అధ్వానంగా ఉన్నాయి. ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ-భీమిలి మధ్య కొత్తగా కొన్ని బీచ్‌లను గుర్తించారు. ఒక్కో దాన్ని రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక రచించారు. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆ తరువాత వాటి ప్రగతిలో ఎటువంటి కదలిక లేదు.

ఆ నిధులతో చేయాలనుకున్నా..

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) గతంలో కొన్ని బీచ్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం వీటి వద్దకు సందర్శకులు వస్తున్నా...కనీస సౌకర్యాలు లేవు. నిధుల సమస్య ఉన్నప్పటికీ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో మొదట ఈ పనులు చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఫుడ్‌ కోర్టులు, పిల్లలు ఆడుకునేందుకు వసతులు, నడక మార్గాలు, వ్యాయామశాలలు, స్నానాల గదులు, తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్‌ జోన్లు, వాచ్‌ టవర్‌ వంటివి ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పుడు వీటి గురించి ఆలోచనే చేయడం లేదు.

సాగర్‌నగర్‌ బీచ్‌కు వెళ్లే దారి ఇలా అభివృద్ధి

దృష్టిసారించక..

నగర వాసులకు సమీపంలోని ఉంటుందని సాగర్‌నగర్‌ బీచ్‌కు పలువురు వస్తున్నా ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక్కడ కనీస సౌకర్యాలు, విశ్రాంత షెడ్లు లేవు. దానికి సమీపంలోనే మురుగునీరు సముద్రంలో కలుస్తోంది.  అక్కడక్కడ అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. మంగమారిపేట వద్ద తీరం విహారానికి అనువుగా ఉన్నప్పటికీ అభివృద్ధి చేయడం లేదు.  దీనికి సమీపంలో సహజ శిలాతోరణం ఉంది. గతంలో ఇక్కడ పర్యాటకుల నిమిత్తం బల్లలు ఏర్పాటు చేశారు. అలల కోత వల్ల అవి కొట్టుకుపోయాయి. ఇటీవల ఇక్కడ గ్రావెల్‌తో ఈ ప్రాంతాన్ని నింపేశారు. చేపలుప్పాడ వద్ద కూడా ఇలాగే ఉంది.  తిమ్మాపురం బీచ్‌లో పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటుచేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని