వీధి దీపాలు, కాల్వలపై అధికంగా ఫిర్యాదులు
స్పందన అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ మల్లికార్జున
కార్పొరేషన్, న్యూస్‌టుడే: స్పందన అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో కార్యక్రమంలో కలెక్టర్, జేసీ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 225 వినతులను అందజేశారు. అనంతరం సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం, ఇతర అంశాలపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. అర్జీలను స్పందన పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలను సంబంధిత శాఖల అధికారులు తరచూ తనిఖీ చేయాలన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పనులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పనులకు ప్రాధాన్యతల వారీగా టెండర్లు ఆహ్వానించి ప్రారంభించాలన్నారు. స్పందనలో జీవీఎంసీపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీధి దీపాలు, కాలువల నిర్వహణ, మంచినీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారంపై జీవీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జీవీఎంసీ ‘స్పందన’కు 67...
సమస్యలు వింటున్న మేయరు గొలగాని హరి వెంకట కుమారి
కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 67 అర్జీలు వచ్చాయి. మేయరు గొలగాని హరి వెంకట కుమారి వాటిని స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్-2కు 15, మూడో జోన్‌కు 11, నాలుగో జోన్‌కు ఏడు, జోన్-5కు 10, జోన్-6కు 17, జోన్-8కు మూడు, ప్రధాన కార్యాలయానికి నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. వీటిలో పరిపాలన విభాగానికి సంబంధించి మూడు, రెవెన్యూకు 9, ప్రజారోగ్య విభాగానికి మూడు, పట్టణ ప్రణాళికకు 33, ఇంజినీరింగ్‌కు 8, యూసీˆడీకి 11 చొప్పున ఉన్నాయి. అంతకు ముందు నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి 27 వినతులు వచ్చాయి.
రహదారి నిర్మించకుండా టీడీఆర్ ఎలా ఇస్తారు?: జనసేన
జేసీ విశ్వనాథన్‌కు వినతిపత్రం ఇస్తున్న మూర్తియాదవ్
కార్పొరేషన్, న్యూస్‌టుడే: విశాఖలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం జేసీ విశ్వనాథన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సీబీసీఎన్‌సీ భూములను కాపాడాలని, అక్రమంగా ఇచ్చిన టీడీఆర్‌ను రద్దు చేయడంతోపాటు జీవీఎంసీ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు కలసి సీబీసీఎన్‌సీ, సాంఘిక సంక్షేమశాఖ స్థలాలను కాజేస్తున్నారని ఆరోపించారు. ఆధారాల సహా సంయుక్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రోడ్డు వేయకుండా, డోర్ నెంబరు లేకుండా తప్పుడు జీఓ 345తో రూ.62కోట్ల విలువైన టీడీఆర్‌ను కమిషనర్ ఇచ్చారని ఫిర్యాదు చేశామన్నారు. సీబీసీఎన్‌సీ భూములు 18 సంస్థలకు చెందితే, ఒక వ్యక్తి పేరిట టీడీఆర్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సర్వే నెంబరు 75-4లో సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహం ఏమైందో కలెక్టర్ నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జనసేన నాయకులు శ్రీనివాస పట్నాయక్, శివప్రసాద్, రామకృష్ణ, కృష్ణ, రవి, వీర మహిళలు రూప, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు 42 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ బాపూజీ
ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఉత్తర్వులతో సోమవారం పోలీసు సమావేశమందిరంలో నిర్వహించిన స్పందనలో పలువురు పాల్గొని సుమారు 42 అర్జీలు అందజేశారు. ఈ స్పందనను ఏసీపీ(ఎస్సీ, ఎస్టీ సెల్) బాపూజీ నిర్వహించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు కమిషనర్ శ్రీకాంత్, డీసీసీలు, ఏడీసీపీలు, ఏసీపీలతో పాటు అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని సి.ఐ.లు, ఎస్.ఐ.లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్పందనకు సుమారు 42 మంది ఫిర్యాదుదారులు హాజరై, తమ ఫిర్యాదులను తెలియజేసి సంబంధిత వినతులను సమర్పించారు. వీరితో ఏసీపీ బాపూజీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సీపీ శ్రీకాంత్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్ల పోలీసు అధికారులతో మాట్లాడి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వనవిహార్ భూములపై విచారణకు వినతి
కార్పొరేషన్, న్యూస్‌టుడే: విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అటవీశాఖకు చెందిన వన విహార్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపెళ్ల పైడిరాజు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వన విహార్ భూములను పరిశీలించడానికి వెళ్లిన సీపీఐ నాయకులను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేటకు చేరుకుని జేసీ విశ్వనాథన్‌ను కలిసి ఫిర్యాదు అందించారు. వన విహార్ బ్లాక్ నెంబరు 12, సర్వే నెంబరు 88లో 3.60ఎకరాల భూమిపై వివాదం నెలకొందని, కొందరు దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని పైడిరాజు ఆరోపించారు. ఆయా భూములును పరిశీలించడానికి వెళితే అడ్డుకుంటున్నారన్నారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!