logo

స్ట్రైక్‌ కొట్టి.. పతకాలు పట్టి..

పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడల్లో ఉన్నత స్థానానికి చాలామంది తపనపడతారు. పట్టుదలతో కృషి చేసి మెచ్చుకోదగిన విజయాలు సాధిస్తారు.

Updated : 07 Dec 2022 04:21 IST

క్యారమ్స్‌లో జాతీయ స్థాయిలో రాణింపు

దిల్లీలో జాతీయ క్యారమ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బిహార్‌కు చెందిన ప్రత్యర్థితో ఆడుతున్న హారిక

కశింకోట, న్యూస్‌టుడే: పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడల్లో ఉన్నత స్థానానికి చాలామంది తపనపడతారు. పట్టుదలతో కృషి చేసి మెచ్చుకోదగిన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో చేరాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక ఈ ఉత్సాహం కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఇది మరింత ఎక్కువ. ఓవైపు ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ.. మరోవైపు తనకిష్టమైన ఆటపై గురిపెట్టి వరస విజయాలు నమోదు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆమే కశింకోట మండలానికి చెందిన హారిక.

జెట్టపురెడ్డితుని సచివాలయంలో సంక్షేమాధికారిగా పనిచేస్తున్న హారికకు చిన్నతనం నుంచి క్యారమ్స్‌ ఆటపై ఆసక్తి ఎక్కువ. తన ఎనిమిదో ఏట నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్ట్రైకర్‌ చేతబట్టారు. ఆటపై ఆసక్తితో మెలకువలను నేర్చుకుంటూ పలు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థ్థ్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. బీడీఎస్‌ చదువు పూర్తయ్యాక వివాహం చేసుకున్నారు. తరవాత సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలో విజయం సాధించి సంక్షేమాధికారి కొలువు దక్కించుకున్నారు. తనకిష్టమైన ఆటను పక్కనపెట్టలేదు. ఎక్కడ పోటీలు జరిగినా అందులో పాల్గొని గురిచూసి కాయిన్స్‌ పడగొట్టి పతకాలు కొల్లగొడుతున్నారు.


* గత నెల 25-27 తేదీల్లో గూడూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్‌  తెలంగాణా ఇన్విటేషన్‌ క్యారమ్స్‌ టోర్నమెంట్‌లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు.


* నవంబరు 7నుంచి 11 వరకు దిల్లీలో జరిగిన 50వ సీనియర్‌ నేషనల్‌ క్యారమ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా జట్టుకు నాయకురాలిగా వ్యవహరించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకు చేరుకుని బిహార్‌ 2-1 స్కోర్‌ ఓడిపోయారు. నవంబరు 16 నుంచి 20 వరకు అగర్తలలో జరిగిన జాతీయ సివిల్‌ సర్వీసెస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌ జట్టును క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకు తీసుకెళ్లారు.

ఇప్పటివరకు జిల్లాస్థాయిలో 45, సౌత్‌ ఛాంపియన్‌షిప్‌లో 10, రాష్ట్రస్థాయిలో 36, జాతీయ స్థాయిలో 18 పతకాలు సాధించారు. 2009లో విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించిన సీనియర్‌ జాతీయ మహిళల క్యారమ్‌ పోటీల్లో మహారాష్ట్ర క్రీడాకారిణితో పోటీపడి వైట్‌స్లామ్‌ కొట్టిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు.


* 2021 ఆగస్టులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ముంబయిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు మహిళ జట్టుకు నాయకురాలిగా వ్యవహరించారు.


2022 మార్చి 11 నుంచి 22 వరకు దిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో ప్రతిభ చూపారు.


నిరంతర సాధన

ఎం.ఎస్‌.హారిక

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా నిరంతర సాధన చేస్తున్నాను. చిన్ననాటి నుంచి తల్ల్లిదండ్రులు సుందరమూర్తి, బి.వి.రమణి ప్రోత్సహించేవారు. వివాహమైన తర్వాత భర్త ఎల్‌.కన్నబాబు పూర్తిగా సహకరిస్తున్నారు. వృత్తిరీత్యా కూడా అధికారులు పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నారు. వీరందరి సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో రాణించగలననే మనోధైర్యంతో ముందుకు అడుగులు వేస్తున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని