logo

విధేయులకు ఎమ్మెల్సీ పదవులు

వైకాపా అధిష్ఠానానికి విధేయులుగా ఉన్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన మత్స్యకార నేత, వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులును ఎమ్మెల్యేల కోటా కింద

Published : 21 Feb 2023 04:00 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వైకాపా అధిష్ఠానానికి విధేయులుగా ఉన్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన మత్స్యకార నేత, వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులును ఎమ్మెల్యేల కోటా కింద, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబును గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. సోమవారం ఉదయమే ఇద్దరు నేతలకు పార్టీ నుంచి పిలుపు రావడంతో వెంటనే విజయవాడ వెళ్లారు. కీలక పదవులు దక్కడంతో ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్న కోలా గురువులు ప్రారంభం నుంచి వైకాపాలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తొలిసారి 2009లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. తదుపరి వైకాపాలో చేరారు. అప్పటి నుంచి అందులోనే కొనసాగుతున్నారు. దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌కుమార్‌ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో ద్రోణంరాజు శ్రీనివాసరావుకు దక్షిణ టికెట్‌ ఇచ్చారు. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో 2020 డిసెంబరులో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని గురువులుకు ఇచ్చారు.  2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని కోలా గురువులు పేర్కొన్నారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఏయూలో ఆచార్యునిగా పనిచేసిన కె. రవిబాబు పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎస్‌.కోట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తదుపరి తెదేపాలో కొంత కాలం పని చేసి వైకాపాలోకి మారారు. 2014, 2019 ఎన్నికల్లో అరకు టికెట్‌ ఆశించినప్పటికీ రాలేదు. తర్వాత రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు తాజాగా గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని