logo

జగన్‌ సభ ఎఫెక్ట్‌.. బస్సు ఎక్కి దిగితే రూ.65

సీఎం జగన్‌ బహిరంగ సభ పుణ్యమా! అని ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది.

Updated : 08 Mar 2024 08:00 IST

రూటు మార్చడంతో ప్రయాణికులకు వాత

ఈనాడు అనకాపల్లి, ఎలమంచిలి, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ బహిరంగ సభ పుణ్యమా! అని ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన బస్సులు అచ్యుతాపురం వైపు దారి మళ్లించారు. బస్సు ఎక్కి దిగితే రూ.65 చెల్లించాల్సి ఉంటుందని కండక్టర్లు చెప్పడంతో ప్రయాణికులు కంగుతిన్నారు. చాలా మంది బస్సులు దిగి ఆటోలను ఆశ్రయించారు. పిసినికాడలో సీఎం సభ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా నర్సింగబిల్లి, తాళ్లపాలెం, బయ్యవరం, అనకాపల్లి వెళ్లాల్సిన వారు ఎలమంచిలి, నారాయణపురం, అచ్యుతాపురం, మునగపాక మీదుగా అనకాపల్లి వెళ్లాల్సి వచ్చింది.

బస్సులు చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల ఎలమంచిలిలో ఎక్కి కూర్మన్నపాలెం మధ్య ఎక్కడ దిగినా రూ.65 చెల్లించాల్సిందేనని కండక్టరు స్పష్టం చేశారు. ఎలమంచిలి నుంచి నారాయణపురం, అచ్యుతాపురం మీదుగా వెళ్లేవారు నేరుగా కూర్మన్నపాలెం వరకూ టికెట్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో నారాయణపురం వెళ్లాల్సిన వారు 3 కి.మీ. దూరానికి రూ.65 చెల్లించాలా అంటూ బస్సులు దిగిపోయారు. మరోవైపు బస్సుల కోసం ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూశారు. జాతీయ రహదారిపై ప్రయాణించే బస్సులు అచ్యుతాపురం మీదుగా వెళ్లాలన్న సమాచారం లేకపోవడంతో నిలిపివేశారు. ప్రయాణికుల నుంచి ఒత్తిడి పెరగడంతో డిపోమేనేజర్లకు ఫోన్‌ చేసి వారి నుంచి అనుమతి వచ్చాక కొన్ని బస్సులు చుట్టూ తిరిగి ప్రయాణించాయి. కొన్ని డిపోల నుంచి అనుమతులు రాకపోవడంతో మధ్యాహ్నం వరకూ బస్సులు కాంప్లెక్స్‌లోనే ఉన్నాయి. సభ ముగిసిన తర్వాతా జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని