logo

అభిమాన ప్రభం‘జనం’

పాయకరావుపేట తెదేపాకు పెట్టని కోటని రుజువైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం సభకు జనం పోటెత్తి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.

Updated : 16 Apr 2024 05:25 IST

జోష్‌ నింపిన అధినేత పర్యటన
గెలుపుపై కూటమి నేతల్లో ధీమా

అభ్యర్థులు అనిత, రమేష్‌లను సభలో పరిచయం చేస్తున్న చంద్రబాబు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేట తెదేపాకు పెట్టని కోటని రుజువైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం సభకు జనం పోటెత్తి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎన్నడూలేని విధంగా వేలాదిగా అభిమాన జనం తరలిరావడంతో కూటమిలోనూ హుషారు నెలకొంది. పాయకరావుపేట పట్టణం పూర్తిగా ఆదివారం జనంతో నిండిపోవడం చూసి తెదేపా, జనసేన, భాజపా నాయకుల్లో ఉత్సాహం రెట్టింపైంది. చంద్రబాబు పర్యటన రెండు గంటలు ఆలస్యమైనా జనం ఓపికతో వేచి ఉండటంతోపాటు ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. సభ ముగిసే వరకు జనం వేచి ఉన్నారు. తెదేపా ప్రకటించిన మేనిఫెస్టోలోని మహిళా శక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్‌ సిలిండర్ల ఉచితం తదితర పథకాలు ప్రకటిస్తున్న సమయంలో జనం నుంచి పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కూటమి నాయకులు సమష్టిగా శ్రమించడంతో మూడు పార్టీల కార్యకర్తలు, జనం ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు. చంద్రబాబును చూసేందుకు పట్టణవాసులు సైతం తరలివచ్చారు. భవనాలపైకి చేరుకుని ఆయన్ని తిలకించారు. జిల్లాలో తొలిసారిగా ఎన్నికల ప్రచార శంఖారావానికి పాయకరావుపేట నుంచి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పర్యటన విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. వంగలపూడి అనితను గెలిపించి అసెంబ్లీకి, సీఎం రమేశ్‌ను పార్లమెంటుకు  పంపించాలని నాయకులకు సూచించారు. కోటవురట్ల, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, నక్కపల్లి మండలాల నుంచి ర్యాలీగా వచ్చిన జనంతో పేట జనసంద్రాన్నే తలపించింది. ప్రధాన రహదారి సహా మంగవరం రోడ్డు, బృందావనంలోని దుర్గాలమ్మ చెట్టు వీధి, మిగతా రోడ్లు జనంతో నిండిపోయాయి. ఇప్పటికే మూడు పార్టీల నాయకులు, కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళుతూ పార్టీ ప్రకటించిన పథకాలను వివరిస్తున్నారు. అంతేగాక మరో పక్క కూటమి నాయకులు ఆయా మండలాల పరిధిలో విడివిడిగా ప్రచారాన్ని చేపడుతున్నారు. పేటలో భారీ మెజారిటీతో విజయాన్ని సాధించాలనే సంకల్పంతో నాయకులు పనిచేస్తున్నారు. పాయకరావుపేట నుంచి వైకాపా నాయకుడు గూటూరు శ్రీనివాసరావు సహా పాల్మన్‌పేట, పాల్తేరు, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల నుంచి పార్టీలోకి భారీగా వైకాపా క్యాడర్‌ చేరుతున్నారు. దీంతో వైకాపాలోనూ బేజారు మొదలైంది.

హాజరైన జనసందోహం


వైకాపా పాలనలో దళితులకు అన్యాయం

మాట్లాడుతున్న రమేశ్‌

అనకాపల్లి, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ తెలిపారు. తెదేపా ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్‌ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ నిర్వహించిన దళితుల ఆత్మీయ సమేళనంలో ఆయన మాట్లాడారు. దళితల సంక్షేమం కోసం తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 27 పథకాలను వైకాపా రద్దు చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలను తిరిగి అమలు చేస్తామన్నారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. ఈ కార్యక్రమానికి గణేష్‌ అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, జనసేన నాయకులు దూలం గోపి, పావాడ కామరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు