logo

బిగ్గరగా అరిచావ్‌.. ఆర్టీసీని మరిచావ్‌

ఏదైనా అత్యవసరపనిపై వెళ్లేందుకు ఆర్టీసీ బస్సెక్కితే దిగే వరకూ దడే!! మొదట ఛార్జీ ఎంతో తెలియగానే ఆందోళన రేగుతుంది! ఇంతలో ఆ బస్సు చక్రమైనా ఊడిపోవచ్చు...స్టీరింగ్‌ అయినా పట్టేయొచ్చు!

Published : 16 Apr 2024 04:52 IST

డొక్కుగా మారిన బస్సులనే తిప్పిన జగన్‌ సర్కార్‌
ఎక్కడికక్కడ ఆగిపోతున్న దుస్థితి
ఛార్జీల పెంపు ఆపని ప్రభుత్వం
కొత్త బస్సుల్లో ప్రయాణయోగం లేని నగర వాసులు
ఈనాడు, విశాఖపట్నం

దైనా అత్యవసరపనిపై వెళ్లేందుకు ఆర్టీసీ బస్సెక్కితే దిగే వరకూ దడే!! మొదట ఛార్జీ ఎంతో తెలియగానే ఆందోళన రేగుతుంది! ఇంతలో ఆ బస్సు చక్రమైనా ఊడిపోవచ్చు...స్టీరింగ్‌ అయినా పట్టేయొచ్చు! మంటలైనా రేగొచ్చు....వర్షం పడితే నీళ్లు లోపలికి రావొచ్చు..అద్దాలు కూడా లేకపోవచ్చు...అసలు ఏమయిందో తెలియకుండా అలాగే నడిరోడ్డుపై అప్పటికప్పుడు ఆగిపోవచ్చు!! దీంతో మరింత గుండెదడ పెరుగుతుంది!! ఇదంతా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనా పుణ్యమే. కొత్తబస్సులు కొనుగోలు చేయడంలో అంతులేని తాత్సారం చేశారు. ఆర్టీసీని, ఉద్యోగులను ఉద్ధరిస్తానని ప్రతిపక్ష నేతగా గట్టిగా చెప్పారు. కానీ, కాలం చెల్లిన బస్సులతో ఐదేళ్లు గడిపారు.అసలు కొత్త బస్సుల్లో ప్రయాణిస్తామా...ఆ యోగం మనకు ఉందా అని నగర వాసుల్లో చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో తగిన తీర్పు ఇస్తేనే అది జరుగుతుందంటున్నారు.

తరచూ మరమ్మతులు: ఆర్టీసీ ఛార్జీలను మూడుసార్లు పెంచేసిన వైకాపా ప్రభుత్వం డొక్కు బస్సులను రోడ్డెక్కించి జనం బతుకులతో చెలగాటమాడుతోంది. తుక్కు కింద వెళ్లాల్సిన వాటిని నడుపుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు మూడు లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఏ ప్రమాదానికి గురవుతాయో తెలియక సిబ్బంది ఆందోళనగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం పలు సిటీ బస్సులు మరమ్మతుకు గురై ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మొత్తం బస్సుల్లో సగానికిపైగా పరిమితికి మించి తిరిగినవే ఉన్నాయి. ఏసీ బస్సుల్లో 70 శాతం బస్సులు 15 లక్షల కి.మీ.పైగా తిరిగాయి. దూర ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో బ్రేక్‌డౌన్స్‌ తరచూ పెరిగిపోయాయి. వాస్తవానికి 15 ఏళ్లు దాటినవి తుక్కు కింద పడేయాలి. కొన్నింటిని 15 ఏళ్లు కాలేదని తిప్పుతున్నారు.

  • మరమ్మతులకు గురైనవాటిని వర్క్‌షాపులకు పంపితే భారీగా ఖర్చవుతుందని స్థానికంగా తక్కువ ఖర్చుతో పనులు చేయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
  • నిబంధనల ప్రకారం ప్రతి మూడు బస్సులకు ఒక మెకానిక్‌ అందుబాటులో ఉండాలి. తగిన సిబ్బంది లేక ఇబ్బందులు వస్తున్నాయి. శిక్షకులు, పొరుగుసేవల ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నారు.

ఆగితే కదలదు...అందుకే ఇలా


బస్సు.. దాని చుట్టూ జనం ఉన్నారేంటని ఆలోచిస్తున్నారా..! అప్పటివరకు ఆ బస్సులో ప్రయాణించినవారే వీరు.అకస్మాత్తుగా ఆగిపోవడంతో కిందికి దిగి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బీచ్‌రోడ్డులో  ప్రయాణికులకు ఎదురైన  కష్టమిది.


కొన్ని ఘటనలు ఇలా

  • జ్ఞానాపురం కాన్వెంట్‌ కూడలి పైవంతెన మీద బస్సు దగ్ధమైంది. వెనుక    టైరు నుంచి మంటలు రేగి వ్యాపించాయి. చక్రం రిమ్‌ లోపం వల్ల మంటలు వచ్చాయని అప్పట్లో నిర్ధారించారు. బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై ప్రయాణికులను దించగా పెను ముప్పు తప్పింది.
  • బీచ్‌ రోడ్డులోని గోకుల్‌ పార్క్‌ వద్ద స్టీరింగ్‌ పట్టేయడంతో బస్సు ఫుట్‌పాత్‌పైకి దూసుకుపోయింది.
  • విశాఖ నుంచి దేవరాపల్లి వెళ్తున్న బస్సు కొత్తవలస దాటాక చక్రం ఊడిపోయి ఒరిగిపోయింది.

సింహాచలం -  విజయనగరం మార్గంలో ప్రయాణిస్తున్న ఓ బస్సు చక్రం  అకస్మాత్తుగా ఊడి  పడింది. బస్సు అలాగే కొద్దిదూరం ముందుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని