logo

ఇంటింటికి అన్నారు.. వీధుల్లో పెట్టారు

చౌక ధరల దుకాణాల్లో రేషను సరకులు తీసుకునే లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లకుండానే.. ఇంటి ముంగిటకే సరకులు చేరవేస్తాం. ఇంటింటికీ వచ్చి సరకులు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారు.

Published : 17 Apr 2024 04:02 IST

ఎండీయూ వాహనాల దుస్థితి
అరకొర సరకుల పంపిణీ
పెందుర్తి, సబ్బవరం, వేపగుంట, పరవాడ, న్యూస్‌టుడే

చౌక ధరల దుకాణాల్లో రేషను సరకులు తీసుకునే లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లకుండానే.. ఇంటి ముంగిటకే సరకులు చేరవేస్తాం. ఇంటింటికీ వచ్చి సరకులు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారు. ఎండీయూ వాహనాల ద్వారా సరకులు పంపిణీని ప్రారంభించి వీధి చివరి చెట్ల కింద, రోడ్డు పక్కన మండుటెండలో లబ్ధిదారులను నిలబెడుతున్నారు. వాహనం వచ్చిన రోజు సరకులు తీసుకోలేకపోతే ఇక ఆ నెలకు సరకులు లేనట్లే. ఇవన్నీ వైకాపా పాలనలోని అవస్థలే.

కందిపప్పు అందడం లేదు: రేషన్‌ పంపిణీలో ఎప్పుడు ఏ సరకులు దొరుకుతాయో తెలియని పరిస్థితి. పంచదార, కందిపప్పు దొరకడం లేదు. బయట మార్కెట్లో కొనుగోలు చేయడం భారంగా మారింది. రోడ్డుపైన నిలబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతినెలా ఒకే సమయంలో రేషను బండి రావడం లేదు.

టి.వరలక్ష్మి


చోడిపిండి కావాలంటే.. బియ్యం వదులుకోవాల్సిందే..: వాహనం ఎప్పుడొస్తే అప్పుడే సరకులు తీసుకోవాలి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే కుదరడం లేదు. బండి వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. బియ్యం మా దగ్గర తీసుకుని చోడిపిండి కావాలంటే మరో రూ.11 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బి.పద్మ


పనులు మానుకొని వేచి ఉండాల్సి వస్తోంది: ఎండీయూ వాహనాలకు సమయపాలన ఉండట్లేదు. పనులు మానుకుని సరకులు కోసం వేచి ఉండాల్సి వస్తోంది. గతంలో ఖాళీ సమయం చూసుకుని రేషన్‌ డిపోలకు వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. వచ్చిన రోజు తీసుకోకపోతే తర్వాత రోజు సరకుల కోసం వేరొక ఊరుకి వెళ్లాల్సి వస్తోంది. సర్వర్‌ పని చేయకపోతే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

యలమంచిలి మంగమ్మ, యలమంచిలిదొడ్డి


సరకుల్లో కోత విధించారు: ప్రస్తుతం బియ్యం, పంచదార తప్ప మిగతా సరకులు ఇవ్వడం లేదు. గతంలో కందిపప్పుతో పాటు తదితర సామగ్రి ఇచ్చేవారు. సంక్రాంతి కానుక, రంజాన్‌తోఫా, క్రిస్మస్‌ కానుక పేరిట చంద్రబాబు హయాంలో పేదలకు సరకులు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటివేమీ ఇవ్వట్లేదు.

సీహెచ్‌ ముత్యాలరావు, ముత్యాలమ్మపాలెం


గతంలోనే మేలు..: ఇప్పటి కంటే గతంలోనే రేషన్‌ పంపిణీ బాగుండేది. ఎండీయూ వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఆ సమయంలో లేకపోతే ఇంకా కష్టమే. ప్రభుత్వం ప్రకటించిన 16 రకాల సరకులు అక్కడ ఉండట్లేదు. ఈ మాత్రం దానికి అంత హంగామా అవసరమా.

ఉప్పాడ సత్యవతి సబ్బవరం


ఇంటింటికి ఎప్పుడూ తెచ్చి ఇవ్వలేదు: ఇంటింటికి బియ్యం అందజేయడానికి ఎండీయూ వాహనాలను వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆవాహనాలు ఎప్పుడూ ఇంటింటికి రావడం కనిపించలేదు. ఏదో ఒకచోట సిగ్నల్‌ వచ్చిన చోట వాహనాన్ని ఆపి అక్కడకు కార్డుదారులందరినీ రమ్మని బియ్యం పంపిణి చేయడం జరుగుతుంది. పాతపద్దతికి, కొత్తపద్దతికి ఎక్కడా మార్పుకనిపించలేదనే చెప్పవచ్చు.

చందక అప్పయ్యమ్మ, వృద్ధురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు