logo

జగన్‌ పంపిన బండి... జనం గుండె మండి!!

‘కొండ  నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేషను సరకుల పంపిణీ తయారైంది. సీఎం నిర్ణయం ప్రకారం మల్టీ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలు జిల్లాకు వచ్చాయి.

Updated : 17 Apr 2024 05:38 IST

ఇదేం పంపిణీ అంటూ ఆగ్రహం
రేషన్‌ లబ్ధిదారులకు అష్టకష్టాలు
మరో వైపు... వాహన ఆపరేటర్ల చేతివాటం

ఎండ చుర్రుమంటున్నా.. వర్షం కురుస్తున్నా... మంచు పడుతున్నా.... చీకట్లోనైనా...
రేషన్‌ బియ్యం, ఇతర సరకుల నిమిత్తం జనం బారులు తీరాల్సిందే.

వైకాపా ప్రభుత్వంలో రేషన్‌ కోసం లబ్ధిదారులు పడిన కష్టాలు అన్నీఇన్నీకాదు.
పిల్లలు, మహిళలు, వృద్ధులు సంచులు పట్టుకొని నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. గుమ్మం ముందుకే వాహనం వస్తుందని ఆకాశం అదిరిపోయేంత స్థాయిలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌... అసలు అలా జరుగుతుందా అన్న విషయమే సమీక్షించలేదు. అందుకే లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో డీలరు వద్దకు వెళ్లి తెచ్చుకునేవారు. అలాకాకుండా ఇంటికే తెచ్చిఇస్తారని చెబితే నమ్మిన జనం ప్రస్తుత పరిస్థితులు చూసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధిచెబితేనే ఈ విధానం మారుతుందని చెబుతున్నారు.


గతంలో..
ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో రేషను డిపోకు వెళితే ఇచ్చేవారు.
ప్రస్తుతం
వాహనం వచ్చిన తర్వాత వెంటనే తీసుకోకపోతే ఇంక అంతే.

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ‘కొండ  నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేషను సరకుల పంపిణీ తయారైంది. సీఎం నిర్ణయం ప్రకారం మల్టీ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలు జిల్లాకు వచ్చాయి. సరకులు మాత్రం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లడం లేదు. నడిరోడ్డుపై, సందుల్లో, ఎక్కడో తనకు తెలిసిన ప్రదేశంలో వాహనం నిలిపి అక్కడికి వచ్చి తీసుకోవాలని పలువురు ఎండీయూ ఆపరేటర్లు హుకుం జారీ చేసే పరిస్థితి నెలకొంది. అంతేనా...‘కిలో బియ్యంకు రూ.10 నుంచి రూ.13లు ఇస్తాం. మాకు ఇచ్చేయండి. ఒక వేళ ఇవ్వకుంటే మీరే పదిసార్లు వాహనం చుట్టూ తిరగాల్సి ఉంటుంది’ అనే హెచ్చరికలూ వస్తున్నట్లు సమాచారం.

డీలరు నుంచి అవసరమైన సరకులు తీసుకొని ఎండీయూ ఆపరేటరు  లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలన్నది నిబంధన. ఈ క్రమంలో ఈ వాహనాలతో మేలు కన్నా నష్టమే ఎక్కువగా ఉందని జనం వాపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఏరికోరి తెచ్చిన వీటి ద్వారా సరకుల పంపిణీ ఒక మాయగా మారింది. అక్రమాలకు అడ్డగా మారింది. పేదల బియ్యం నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకొనేందుకు ఈ వ్యవస్థ అవకాశంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి.


అక్రమాలు ఇలా: లబ్ధిదారుల నుంచి కొందరు ఆపరేటర్లు బియ్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించి కిలో రూ.20ల చొప్పున విక్రయిస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. కొందరు ఒకేసారి డీలరు నుంచి 50 క్వింటాళ్ల బియ్యం తీసుకుంటున్నారు. ఆ సరకంతా వాహనంలో పట్టదు. అందుకే 20 క్వింటాలు డీలరు వద్దే ఉంచుతారు. ఆ తరువాత కొందరు మొత్తం పంపిణీ చేసినట్టు కార్డుహోల్డర్ల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నారు. డీలరు వద్ద ఉంచిన 20 క్వింటాళ్లు నేరుగా నల్లబజార్‌కు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో పౌరసరఫరా శాఖ అధికారులు దాడుల్లో ఈ విషయం బయటపడింది. రైల్వేన్యూకాలనీ, పూర్ణామార్కెట్‌, తాటిచెట్లపాలెం, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో పలువురు ఆపరేటర్లు పూర్తిస్థాయిలో  బియ్యం పంపిణీ చేయడం లేదు. ఆపరేటర్లపై నిఘా ఉంచాల్సిన సీఎస్‌ యంత్రాంగం నిద్రపోతోంది. క్షేత్రస్థాయిలో 20 మంది చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు సహాయ సరఫరా అధికారులున్నప్పటికీ కేసులు మాత్రం నామమాత్రంగా నమోదవుతున్నాయి. ఈ వ్యవస్థ వచ్చిన మూడేళ్లలో అక్రమాలకు పాల్పడిన 50 మంది ఆపరేటర్లపై  కేసులు పెట్టి జరిమానాలు విధించారు. అయినా అక్రమాలు ఆగకపోవటానికి కొందరు అధికారుల తెరవెనుక సహకారమేననే ఆరోపణలొస్తున్నాయి.


ఇళ్ల వద్దకు వస్తేగా..

ఎండీయూ ఆపరేటర్ల తీరుపై కార్డుహోల్డర్లు పెదవి విరుస్తున్నారు. ఇళ్ల వద్దకు వాహనాలు రావడం లేదని, తమకు నచ్చిన ప్రాంతంలో వాహనం ఆపి ఇస్తున్నారని, సమయం, తేదీ వంటివేవీ తెలియకపోవడం వల్ల ఎప్పుడు వాహనం వస్తుందోనని ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. కూలి పనులకు వెళ్లే తాము వాహనం కోసం ఎదురుచూడడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు