logo

రవాణా సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలు!

వానాకాలం సీజన్‌లో మిల్లులకు సొంత కిరాయి చెల్లించి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం బస్తాలను తరలించిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా చార్జీల్లో కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. టన్నుకు రూ. 209.93 చెల్లించాల్సింది రూ.150 చెల్లిస్తూ మిగిలిన రూ.59.93 కాజేశారు.

Updated : 27 May 2022 05:43 IST

దంతాలపల్లిలోని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు బస్తాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లు

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: వానాకాలం సీజన్‌లో మిల్లులకు సొంత కిరాయి చెల్లించి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం బస్తాలను తరలించిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా చార్జీల్లో కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. టన్నుకు రూ. 209.93 చెల్లించాల్సింది రూ.150 చెల్లిస్తూ మిగిలిన రూ.59.93 కాజేశారు. ఇలా రైతుల కష్టార్జితాన్ని జేబుల్లో వేసుకుని రూ.లక్షలు తలా కొంత పంచుకున్నారు. ఈ వ్యవహారమంతా తెలిసినా సంబంధితశాఖ అధికారులు మాములుగా తీసుకున్నారు. దాంతో ధాన్యం రైతులు నష్టాన్ని ఎదుర్కొన్నారు. కిరాయి డబ్బులు చేతికందని రైతులు ఎప్పుడిస్తారంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లో కిరాయి డబ్బులు ఇస్తారనే విషయం అక్కడి రైతులకే తెలియని పరిస్థితి ఉంది..
ఘటనలు ఇలా..
ః తొర్రూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి 4287 టన్నుల ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించారు. వాటన్నింటికీ సంబంధించిన ట్రక్‌ షీట్లను నిర్వాహకులు పౌరసఫరాలశాఖకు ఇచ్చారు. అధికారులు వారికి రవాణా ఛార్జీలుగా టన్నుకు రూ. 209.93 చొప్పున రూ.9 లక్షలను చెల్లించారు. నిర్వాహకులు రైతులకు టన్నుకు రూ.209.93 చొప్పున కాకుండా రూ. 150 చొప్పున రూ. 6.43 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.59.93 ఇవ్వలేదు. ఈ లెక్కన 4287 టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.2.56 లక్షలు అక్రమం జరిగింది.
*పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్ల ద్వారా తరలించిన 340 టన్నుల ధాన్యానికి టన్నుకు రూ.209.93 చొప్పున రూ.71,376 చెల్లించాలి. నిర్వాహకులు రూ.150 చొప్పున చెల్లించారు. ఇదే మండలంలోని పోచంపల్లి ఐకేపీ కేంద్రం ద్వారా తరలించిన 112 టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.23,512లోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇలా కేసముద్రం, నెల్లికుదురు, కొత్తగూడ, కురవి తదితర మండలాల్లోనూ నిర్వాహకులు, గుత్తేదారులు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకుండా రూ.లక్షలు అక్రమాలకు పాల్పడిన సంఘటనలున్నాయి.
* నర్సింహులపేట, దంతాలపల్లి మండలంలో నర్సింహులపేట పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 1.22 లక్షల టన్నుల ధాన్యాన్ని 2100 ట్రాక్టర్లు, ఇతర సొంత వాహనాల ద్వారా సుమారు 2300 మంది రైతులు మిల్లులకు తరలించారు. ఒక్కో రైతు వాహనాలకు రూ.1500 నుంచి రూ.2500 వరకు కిరాయి చెల్లించారు. వాటికి సంబంధించిన ట్రక్‌షీట్లను తీసుకున్న పీఏసీఎస్‌ అధికారులు ఇప్పటికీ రవాణా ఛార్జీలను అందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కిరాయి డబ్బులు ఇవ్వలేదు
-ఉడుగుల మల్లయ్య, పెద్దముప్పారం, దంతాలపల్లి

గత వానాకాలంలో 160 బస్తాల ధాన్యం రూ.1800 కిరాయి చెల్లించి ట్రాక్టర్‌ ద్వారా దంతాలపల్లిలోని మిల్లుకు తరలించా. కిరాయి సొమ్ము ఇస్తారనేది తెలియదు. కొద్ది రోజులకు తోటి రైతులు వస్తాయని చెప్పడంతో అధికారులను అడిగితే ఇస్తామన్నారు. ఇంత వరకు ఇవ్వలేదు. యాసంగిలోనూ 170 బస్తాలను రూ.2 వేల కిరాయితో మిల్లుకు తీసుకొచ్చా. ఈ రెండు పంటలకు సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంది.


కలెక్టర్‌ చెప్పినా
ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు రవాణా చేసే కాంట్రాక్టరు అనుకున్న మేర లారీలు సరఫరా చేయకపోవడంతో సమస్య వస్తుందని భావించి 20 కిలోమీటర్ల వరకు దూరం ఉన్న మిల్లులకు రైతులే ట్రాక్టర్ల ద్వారా తరలించుకోవాలని..అందుకు సొంతంగా కిరాయి చెల్లిస్తే అ డబ్బులను ఇప్పిస్తామని కలెక్టర్‌ శశాంక చెప్పారు. అయినప్పటికీ గుత్తేదారు, నిర్వాహకులు తమ విధానాన్ని మార్చుకోలేదు. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. వాటి ద్వారా 39,131 మంది రైతుల నుంచి 1,83,482 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో జిల్లాలోని 53 మిల్లులకు 1.27 టన్నులు, 56 వేల టన్నుల ధాన్యాన్ని వరంగల్‌, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలకు తరలించారు. జిల్లాలోని మిల్లులకు తరలించిన ధాన్యంలో సగానికి పైగా రైతులు తమ సొంతంగా కిరాయిలు చెల్లించి ట్రాక్టర్ల ద్వారా పంపించినవే ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు రైతుల నుంచి ట్రక్‌ షీట్లు తీసుకుని కిరాయి డబ్బులు చెల్లించాలి. కాని అధికారులు గుత్తేదారులకు చెల్లించడంతో వారు చేతివాటం ప్రదర్శించారు.

కోత విధించినట్లు తెలియదు..
రవాణాకు సంబంధించిన ట్రక్‌షీట్లు ఇటీవలే కార్యాలయానికి అందించారు. త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ మహేందర్‌ తెలిపారు. ప్రస్తుతం చెల్లించిన డబ్బుల్లో కోత పెట్టినట్లు తెలియదన్నారు. అలా ఎందుకు చేశారో తెలుసుకుంటానని పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని