logo

Mahabubabad: ఈ ప్లాట్లు కొంటే పాట్లే!

జిల్లాలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల పరిధిలో స్థిరాస్తి దందా జోరుగా సాగుతోంది.

Updated : 24 Sep 2023 10:42 IST

ఈనాడు, మహబూబాబాద్‌,న్యూస్‌టుడే, మహబూబాబాద్‌: జిల్లాలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల పరిధిలో స్థిరాస్తి దందా జోరుగా సాగుతోంది. కాసులు పంట పండిస్తుండడంతో పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వ్యాపారుల అక్రమార్జనకు పంట పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. అక్రమార్కులు యథేచ్చగా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. డీటీపీసీ, నాలా అనుమతులు లేకుండానే ప్లాట్ల అమ్మకాలు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టింపులేనట్లు వ్యవహరిస్తుండటంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా ఉంది. మహబూబాబాద్‌ నుంచి తొర్రూరు వెళ్లే దారిలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో సదుపాయాలు ఏమీ కల్పించకుండానే అమ్మకాలు చేస్తున్నారు. తొర్రూరు పట్టణంలో ఒకరు నాలా అనుమతులు లేని ప్లాటు అని తెలియక కొనుగోలు చేశారు. ఇప్పుడు అందులో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి దరఖాస్తు చేసి మున్సిపాలిటీకి వెళ్లితే నాలా అనుమతి లేదంటూ తిరస్కరించారు. ఇదొక ఉదాహరణ. ఈ విధమైన సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులు మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఉన్నారు.


నెల్లికుదురు నుంచి ఇనుగుర్తి వైపు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన వెంచరు ఇది. 2020లో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఇందులో రహదారుల, డ్రైనేజీ నిర్మాణం చేయలేదు. విద్యుత్తు స్తంభాలు లేవు. గ్రామ పంచాయతీకి 10 శాతం స్థలం కేటాయింపు లేదు. కాని నిర్వాహకులు అనుమతులున్నాయని, సదుపాయాలు కల్పిస్తామంటూ విక్రయాలు చేపడుతున్నారు. గజాల చొప్పున కాకుండా గుంటల లెక్కన విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. అందులో ప్లాటు కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేసేటప్పుడు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సంబంధిత అధికారులకు తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
- న్యూస్‌టుడే, నెల్లికుదురు


గుర్తించడం ఎలా అంటే

  •  లేఅవుటు అనుమతి పొందితే డీపీ నెంబరు అడగాలి. నెంబరు ఉంటేనే అనుమతి ఉన్నట్లు
  • లేఅవుటు ప్లాను చూసుకోవాలి
  •  పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు సరిచూసుకోవాలి
  •  అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ప్లాన్‌లో చూసుకోవాలి

నష్టాలివీ

  •  గృహాల, ఇతర భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు
  •  టీఎస్‌-బీపాస్‌ ద్వారా అనుమతులు పొందాలంటే అదనంగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది
  •  బ్యాంకుల నుంచి రుణం రాదు.    
  •  భవిష్యత్తులో స్థలాలపై న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు.      
  •  మౌలిక సదుపాయాలు ఉండవు

తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని పాలకేంద్రం సమీపంలో నాలుగు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన వెంచరు ఇది. సుమారు నాలుగెకరాల విస్తీర్ణంలో వేసిన వెంచరులో నిబంధనలేమీ పాటించలేదు. కొనుగోలుదారులను మభ్యపెట్టడానికి విద్యుత్తు స్తంభాలు నాటారు. కాని వాటికి తీగల ఏర్పాటు చేయలేదు. రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికే ప్లాట్ల విక్రయాలన్నీ పూర్తి చేశారు. ఇలా తొర్రూరు మండల పరిధిలో సుమారు 12 వెంచర్ల వరకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.   

న్యూస్‌టుడే, తొర్రూరు


నిబంధనలు ఇలా

  •  కొత్తగా స్థిరాస్తి వెంచర్‌ ఏర్పాటు చేసే వారు లేఅవుట్‌ అనుమతులు పొందాలంటే ఆ స్థలంలో రోడ్లు, కాలువల నిర్మాణం చేయాలి.  
  •  విద్యుత్తు స్తంభాలు, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించాలి.
  •  నాలా అనుమతి పొందడానికి 10 శాతం ఆ పైన ఖాళీ స్థలం మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి అప్పగించాలి.
  •  ఆ స్థలాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకొస్తారు.
  • వెంచర్లు చేస్తున్న వారు పై నిబంధనలేవీ పాటించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. కొనుగోలుదారులను మోసగిస్తున్నారు.

కార్యదళం ఉన్నా

అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు శాఖలకు చెందిన అధికారులుంటారు. వీరు పుర, గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై నిఘా పెట్టి వాటిని ఆరికట్టాలి. కాని కార్యదళం పూర్తిస్థాయిలో పనిచేయనందునే అనుమతులు లేని వెంచర్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.


చర్యలు తీసుకుంటున్నాం

కె.ప్రసన్నరాణి, కమిషనర్‌, మహబూబాబాద్‌

టీఎస్‌-బీపాస్‌ వచ్చాక పట్టణంలో 12 వెంచర్లకు అనుమతులు వచ్చాయి. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన 10 వెంచర్లకు నోటీసులు ఇచ్చాం. కొన్నింటిపై చర్యలు కూడా తీసుకుంటున్నాం. వాటిలో ఏర్పాటు చేసిన హద్దులు తొలగించాం. రోడ్లు ధ్వంసం చేశాం. లే అవుట్‌ ఉన్న వాటికే నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం. అలాంటి వాటిలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. అనుమతులు లేని వాటిలో కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని