logo

ములుగు.. విప్లవాల పుట్టినిల్లు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం విస్తీర్ణంలో అతి పెద్దది. ఆదివాసుల ఖిల్లాగా పేరొందింది. అటవీ ప్రాంతంతో కూడుకొని  ప్రకృతి రమణీయతకు, పర్యాటకానికి చిరునామాగా మారింది.

Updated : 06 Nov 2023 06:11 IST

న్యూస్‌టుడే, ములుగు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం విస్తీర్ణంలో అతి పెద్దది. ఆదివాసుల ఖిల్లాగా పేరొందింది. అటవీ ప్రాంతంతో కూడుకొని  ప్రకృతి రమణీయతకు, పర్యాటకానికి చిరునామాగా మారింది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన  గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర,  వేలాడే వంతెనల లక్నవరం సరస్సు, హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తాడ్వాయి ఏటూరునాగారం అభయారణ్యాలు, గోదావరి నది, ఆసియాలోనే అతి పెద్ద  దేవాదుల ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం సమ్మక్క-సారక్క బ్యారేజి ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేకతలు. ఒకప్పుడు విప్లవ పార్టీలకు పుట్టినిల్లుగా నిలిచిన ములుగు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది.

నియోజకవర్గం ముచ్చట

ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దం కిందటి వరకు రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని విప్లవ గ్రూపులు  ఉండేవి. ఎన్నికల సమయంలో నాయకులు ప్రచారానికి వెళ్లాలంటే బిక్కు బిక్కుమంటూ ప్రచారం చేసుకోవాల్సిందే. నియోజవర్గంలోని 75 శాతం గ్రామాలు అటవీ ప్రాంతంతో ముడిపడి ఉండడంతో నక్సల్స్‌ గ్రూపులు ఆటవీ ప్రాంతాన్ని స్థావరాలుగా మార్చుకుని కార్యకలాపాలు సాగించేవి. సంచలనాలకు మారుపేరైన మావోయిస్టు పార్టీతోపాటు ప్రతిఘటన, జనశక్తి, ప్రజా ప్రతిఘటన, న్యూ డెమాక్రసీ పార్టీలు ములుగు నియోజకవర్గ కేంద్రంగా వాటి కార్యకలాపాలకు వ్యూహరచన చేసేవి. పోలీసుల ప్రాబల్యం పెరగడంతో ప్రస్తుతం మావోయిస్టులు మినహా మిగిలిన అన్ని గ్రూపుల కార్యకలాపాలు తగ్గాయి. ప్రతిఘటన, ప్రజా  ప్రతిఘటన, జనశక్తి పార్టీలు కూడా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుండేవి. 

2,84,481 హెక్టార్ల విస్తీర్ణం

ములుగు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం 6,55,383 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 1,98,445 హెక్టార్లలో అడవి ఉంది. చాలా గ్రామాలు అటవీ ప్రాంతంలో వాగులవతల ఉండటంతో నాటు పడవల్లో వెళ్లి పోలింగ్‌ నిర్వహించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం వంతెనల నిర్మాణంతో పోలింగ్‌ ఇబ్బందులు తగ్గాయి. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆవిర్భావ సమయంలో పీడీఎఫ్‌ పేరుతో పోటీ చేసి కమ్యూనిస్టులు కైవసం చేసుకున్నా..  కాంగ్రెస్‌ అభ్యర్థులే ఎక్కువసార్లు గెలిచారు. రెండో స్థానంలో తెదేపా నిలిచింది. రాష్ట్రంలో తెరాస(ప్రస్తుతం భారాస) ఆవిర్భవించి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా.. 2014 ఎన్నికల్లో ఒక్కసారే గెలిచింది. ఇప్పటివరకు కాంగ్రెస్‌ ఎనిమిది సార్లు, తెదేపా నాలుగు సార్లు, పీడీఎఫ్‌ రెండు సార్లు, తెరాస ఒకసారి,  ఇండిపెండెంట్‌ ఒకసారి గెలిచారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా సంతోష్‌ చక్రవర్తి గెలిచి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. తొలిసారి జరిగిన 1952 ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా పీడీఎఫ్‌ నుంచి హనుమంతరావు గెలిచి చరిత్రలో నిలిచిపోయారు. 1957 ఎన్నికల్లో ములుగు మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన సూర్యనేని రాజేశ్వర్‌రావు పీడీఎఫ్‌ రెండో ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఆ తరువాత కమ్యూనిస్టులు ఏనాడూ దక్కించుకోలేదు.  నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ములుగు నియోజకవర్గాన్ని గిరిజనులకు రిజర్వు చేశారు. పోరిక జగన్నాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి తొలి గిరిజన ఎమ్మెల్యేగా నమోదయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ తెదేపా ఏర్పాటు చేసి ప్రభంజనం సృష్టించినప్పటికీ ములుగు నియోజకవర్గంలో ప్రభావం చూపలేదు.

ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు: 220886
పురుషులు: 108588
స్త్రీలు: 112277
ఇతరులు: 21

బరిలో ఉన్న అభ్యర్థులు...

భారాస:   బడే నాగజ్యోతి
కాంగ్రెస్‌:   ధనసరి అనసూయ సీతక్క
భాజపా:   ఇంకా ప్రకటించలేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని