logo

అరూరికే భాజపా టికెట్‌

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది.. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన అరూరి రమేశ్‌ తొలిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పీఆర్‌పీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు.

Updated : 25 Mar 2024 06:07 IST

అరూరి రమేశ్‌

సుబేదారి, న్యూస్‌టుడే: వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది.. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన అరూరి రమేశ్‌ తొలిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పీఆర్‌పీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు.. ఆ తర్వాత తెరాసలో చేరి 2014, 2018లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నిల్లో ఓటమి పాలయ్యారు. కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన భాజపాలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లో ఆయన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు వచ్చి అరూరిని బలవంతంగా కారులో ఎక్కించుకొని హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా భాజపా నాయకులు, కార్యకర్తలు జనగామ వద్ద అడ్డుకున్నారు. చివరకు దయాకర్‌రావు అరూరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి కేసీఆర్‌తో మాట్లాడించారు. తర్వాత పార్టీ మారడం లేదని అరూరి ప్రకటించారు. వారం రోజుల తర్వాత అరూరి తిరిగి భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. మార్చి 16న భారాస వరంగల్‌ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 17వ తేదీన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో భాజపా కండువా కప్పుకొన్నారు.

పలువురు పోటీ పడినా

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసేందుకు పలువురు పోటీపడ్డారు. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే, భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, దుబాసి వాసుదేవ్‌ టికెట్‌ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు భారాస నుంచి వచ్చిన అరూరికే టికెట్‌ దక్కింది. ప్రస్తుత జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం ఉప్పుగల్లు గ్రామంలో 1967లో గట్టుమల్లు, వెంకటమ్మ దంపతులకు అరూరి రమేశ్‌ జన్మించారు. 1995లో కేయూ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఏటా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో భారాస నుంచి కడియం కావ్య పోటీ పడుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని