logo

మహదేవపూర్‌ పోలీస్‌ సిబ్బందిపై వేటు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్‌ సబ్‌డివిజన్‌ మహదేవపూర్‌ సర్కిల్‌ పరిధిలో పోలీస్‌ సిబ్బందిపై వేటు పడింది. ‘ఈనాడు’లో మార్చి 16న ‘పైసా వసూల్‌, ఈ నెల 15న ‘కానిస్టేబుల్‌ బహిరంగ విందు.

Updated : 16 Apr 2024 05:33 IST

ఒక్క రోజులోనే తొమ్మిది మంది బదిలీ
‘ఈనాడు’లో కథనాలకు స్పందించిన ఎస్పీ

మహదేవపూర్‌, న్యూస్‌టుడే : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్‌ సబ్‌డివిజన్‌ మహదేవపూర్‌ సర్కిల్‌ పరిధిలో పోలీస్‌ సిబ్బందిపై వేటు పడింది. ‘ఈనాడు’లో మార్చి 16న ‘పైసా వసూల్‌, ఈ నెల 15న ‘కానిస్టేబుల్‌ బహిరంగ విందు..’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే స్పందించారు. మహదేవపూర్‌ సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. పోలీస్‌స్టేషన్‌లలో వారిదే పెత్తనం.. ఏదైనా ఫిర్యాదు, సమస్యతో బాధితుడు వస్తే సంప్రదింపులు చేస్తూ అన్నీ వారి కనుసన్నల్లోనే చేయడం.. గొలుసు దుకాణాలు, బియ్యం, ఇసుక, వన్యప్రాణుల వేటకు సంబంధించి మాంసం, అక్రమ దందా వ్యవహారాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, విందులు చేసుకోవడం, నిఘా పేరిట వసూళ్ల పర్వం, డిజిటల్‌ ‘మామూళ్లు’, క్రమశిక్షణరాహిత్యం వంటి పలు ఆరోపణలపై ‘ఈనాడు’లో ప్రచురితమవడంతో పోలీస్‌ శాఖలో ఒక్కసారిగా కలకలం రేపింది.

దీనిపై స్పందించిన ఎస్పీ పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పలు ఆరోపణలు వ్యక్తమవుతున్న పోలీస్‌ సిబ్బందిపై నిఘా విభాగంతో పాటు పోలీస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వివరాలను సేకరించి, నివేదికను జిల్లా ఎస్పీకి అందించారు. దీంతో ఏడుగురు సిబ్బందిపై బదిలీ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహదేవపూర్‌ సర్కిల్‌, పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పలు ఠాణాలకు బదిలీ చేశారు. మహదేవపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఈ.ఉపేందర్‌ను గణపురం, కానిస్టేబుళ్లు బి.ధనుంజయ్‌- మొగుళ్లపల్లి, కె.అరుణ్‌కుమార్‌-రేగొండ, ఎస్‌.విక్రాంత్‌-కాటారం, జి.కిరణ్‌-చిట్యాల, జె.తిరుపతి- కొయ్యూర్‌ పోలీస్‌ ఠాణాలకు బదిలీ చేశారు. మహదేవపూర్‌ సర్కిల్‌ ఎస్బీ నిఘా విభాగానికి చెందిన పి.నాగరాజును టేకుమట్ల ఠాణాకు బదిలీ చేశారు.


ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌పై చర్యలు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలి భర్త గుడాల శ్రీనివాస్‌ సోమవారం ఉదయం మహదేవపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నృత్యం చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగ్గా.. అప్పటికప్పుడే విచారణ చేసి చర్యలు చేపట్టారు. మహదేవపూర్‌ ఎస్సై కె.ప్రసాద్‌ను వీఆర్‌కు అటాచ్డ్‌ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, స్టేషన్‌ ఇన్‌ఛార్జిగా ఉండి అలసత్వ వహించిన హెడ్‌కానిస్టేబుల్‌ సోయం శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశారు. ఇలా ఒక్క రోజులోనే మహదేవపూర్‌ ఠాణా, సర్కిల్‌ పరిధిలో తొమ్మిది మంది సిబ్బందిపై చర్యలకు ఎస్పీ ఉపక్రమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని