logo

నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులు

జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనుమతులు లేకుండానే నిర్వహణ సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి.

Published : 16 Apr 2024 04:51 IST

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనుమతులు లేకుండానే నిర్వహణ సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. మండలాల పరిధిలో ఆర్‌ఎంపీలు క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెద్ద స్థాయి ఆసుపత్రుల పేరుతో నిర్వహిస్తున్న నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారుల తనిఖీలు కొరవడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొరవడుతున్న అధికారుల తనిఖీలు..

జిల్లా కేంద్రంలో ఇటీవల మెటర్నటీ, జనరల్‌ ఫిజిషియన్‌, సర్జన్‌, న్యూరో, ఆర్థోపెడిక్‌, దంత వైద్యం ఇలా పలు విభాగాల్లో విరివిగా ఆసుపత్రులను నెలకొల్పుతున్నారు. జనగామ తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణ కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు అధికంగా ఉన్నాయి. ఆయా దవాఖానాల్లో స్పెషలిస్ట్‌ వైద్యులు లేకున్నా ఉన్నట్లు చూపుతున్నారు. ఆసుపత్రుల భవనాలు ఇరుకుగా ఉండటం, గాలివెలుతురు సరిగ్గా లేకున్నా, అగ్ని ప్రమాద ఘటనలు ఎదుర్కొనేందుకు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు లాంటివి పాటించడం లేదు. అలాగే నిర్వాహకులు ఔషద దుకాణాలు నిర్వహిస్తూ నాసిరకం మందులను రోగులకు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్లినికల్‌ ల్యాబ్‌లో అర్హులైన టెక్నీషియన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. వీటి తనిఖీ నుంచి రెన్యూవల్‌ పనుల వరకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేసే ఓ సాధారణ ఉద్యోగి చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉన్నా.. అలా జరగడం లేదు. పలువురు నిర్వాహకులు సిండికేట్‌ అయి స్కానింగ్‌ కేంద్రాలను నెలకొల్పి కొంత మంది రోగులకు అవసరం లేకున్నా స్కానింగ్‌లు రాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పాటించాల్సిన నియమాలు ఇలా..

ప్రైవేటు ఆసుపత్రులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంది. ప్రతి ఆసుపత్రి బోర్డు పైన రిజిస్ట్రేషన్‌ సంఖ్య ఉండాలి. ఆసుపత్రుల్లో వైద్యుల పేర్లు, వివరాలు అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి. ఫీజుల వివరాలు కూడా పేర్కొనాలి. అవసరమైతేనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులను మాత్రమే డ్యూటీ డాక్టర్లుగా నియమించుకోవాలి. వైద్యులంతా మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులు రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే వైద్యం చేయడానికి అనుమతించాలి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్న వివిధ ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు.


తనిఖీల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు  

- డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. కార్యాచరణ ప్రారంభిస్తాం. ఒక్కో బృందంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారితో పాటు ప్రోగ్రాం అధికారులు, వైద్యులు ఉంటారు. వీరంతా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని