logo

ఓరుగల్లు నుంచి ‘తొలి మహిళ’

ఓరుగల్లు కాకతీయులు ఏలిన రాజ్యం.. అలనాడు రాణి రుద్రమ దేవి తన పరాక్రమంతో శత్రువులను గజగజలాడించి మహిళా సాధికారతను చాటిచెప్పిన ధీర వనిత..

Published : 16 Apr 2024 04:56 IST

ఈనాడు, వరంగల్‌: ఓరుగల్లు కాకతీయులు ఏలిన రాజ్యం.. అలనాడు రాణి రుద్రమ దేవి తన పరాక్రమంతో శత్రువులను గజగజలాడించి మహిళా సాధికారతను చాటిచెప్పిన ధీర వనిత.. ఆమె వారసురాలిగా ఈ ప్రాంతం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డాక్టర్‌ టి.కల్పనా దేవి. కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె ప్రైవేటు ఆసుపత్రి స్థాపించి ప్రజా వైద్యురాలిగా మంచి పేరు సంపాదించారు. 1961లో టి.నరసింహారెడ్డిని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో రాజకీయాల వైపు ఆకర్షితురాలైన కల్పనాదేవి ఆ పార్టీలో 1983లో చేరారు. ఆ తర్వాత 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి పోటీచేసే అవకాశాన్ని పార్టీ ఇచ్చింది. అప్పటివరకు దేశంలో కాంగ్రెస్‌ ఎంతో బలంగా ఉంది. కల్పన పోటీకి ముందు రెండు సార్లు వరుసగా వరంగల్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ఆ కాలంలో మహిళలు రాజకీయాల్లోకి రావడమే అరుదు. అలాంటిది ఏకంగా లోక్‌సభకు పోటీ చేసిన తొలి మహిళే కాకుండా వరంగల్‌ నుంచి పార్లమెంటుకు వెళ్లిన తొలి వనితగా చరిత్ర లిఖించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కమాలుద్దిన్‌ అహ్మద్‌పై 8,456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  ఆమె చొరవతో వరంగల్‌లో పలు ఆసుపత్రులు, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమం అమలైంది. ఆ తర్వాత 1989లో పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం సురేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 1991లో మరోమారు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినా కలిసిరాలేదు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2016 అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని