logo

డీడీలు కట్టరు.. పంచదార ఇవ్వరు!

రేషన్‌ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు.

Published : 18 Apr 2024 05:54 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌

రేషన్‌ దుకాణంలో బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్‌(పాతచిత్రం)

రేషన్‌ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి కచ్చితంగా పంపిణీ చేయాలని ఆదేశాలివ్వడంతో ఇప్పటికైనా ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి నెలా రేషన్‌ షాపుల ద్వారా బియ్యం అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు, చక్కెర పంపిణీ చేసేవారు. కొన్నేళ్లుగా కేవలం బియ్యం మాత్రమే అందజేస్తున్నారు.

జిల్లాలో 9,340 అంత్యోదయ కార్డులు

జిల్లా వ్యాప్తంగా 277 రేషన్‌ దుకాణాలు ఉండగా 1.23 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా 3.45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో 9,340 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. పేరున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుండగా అన్నపూర్ణ కార్డుకు 10 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డుకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు కార్డుకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా రేషన్‌ డీలర్లు ఆసక్తి చూపకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది.

నెలకు 93.40 క్వింటాళ్లు అవసరం

ప్రతి కుటుంబంలో పంచదార ఒక భాగమై పోయింది. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉదయం టీ తాగే అలవాటు ఉంటుంది. పండగలు, శుభకార్యాలు ఏవైనా తీపి పదార్థాలు చేసుకోవాలంటే పంచదార తప్పనిసరి. కిరాణ షాపులో కిలో పంచదార రూ.50 వరకు ఉండటంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్‌ దుకాణాల ద్వారా నెలకు కిలో రూ.13.50కు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అంత్యోదయ కార్డులను లెక్కిస్తే నెలకు 93.40 క్వింటాళ్ల పంచదార అవసరమవుతుందని అధికారులు తెలుపుతున్నారు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మరోలా..

క్షేత్రస్థాయిలో సమస్య మరోలా ఉంటుందని రేషన్‌ డీలర్లు అంటున్నారు. అంత్యోదయ కార్డులు రేషన్‌ దుకాణానికి కేవలం పదుల సంఖ్యలోనే ఉంటాయి. కొన్ని దుకాణాలకు మాత్రం నాలుగు, ఐదు కార్డులే ఉన్నాయి. వారికి బియ్యంతో పాటు పంచదార పంపిణీ చేస్తే తమకు ఎందుకు ఇవ్వడం లేదని మిగతా లబ్ధిదారులు గొడవ పెడుతున్నారని అంటున్నారు. మరోవైపు ఒక రేషన్‌ దుకాణంలో పది మంది లోపు అంత్యోదయ కార్డుదారులు ఉంటే అందులో ప్రతి నెలా కచ్చితంగా లబ్ధిదారులు వచ్చి తీసుకెళ్తారనే నమ్మకం లేదని, దీంతో  తాము నష్టపోవాల్సి వస్తుందని డీలర్లు అంటున్నారు.


కచ్చితంగా డీడీలు కట్టాల్సిందే

- నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

అంత్యోదయ కార్డుదారులకు ప్రతి నెలా కిలో పంచదార పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలు ఉన్నప్పటికి డీలర్లు పంపిణీ చేయడం లేదు. తాజాగా పంచదార పంపిణీకి సంబంధించి డీలర్లు వారి కోటా ప్రకారం డీడీలు కట్టాల్సిందేనని వారం క్రితం సర్క్యులర్‌ జారీ చేశాం. పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని