logo

లోక్‌సభ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు

ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. ‘మహబూబాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

Published : 18 Apr 2024 05:57 IST

మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల అధికారి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌

ఈనాడు, మహబూబాబాద్‌: ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. ‘మహబూబాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గురువారం నుంచి మొదలయ్యే నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం.’ అని ఆర్వో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు.. నామపత్రాల స్వీకరణ తదితర అంశాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

పోలింగ్‌ కేంద్రాల పెంపు

లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుషులు, 7,83,280 మంది మహిళలు, 105 మంది ఇతరులున్నారు. ఏడు శాసనసభ స్థానాల్లో 1783 పోలింగ్‌ కేంద్రాలుండగా 30 అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. దీంతో కేంద్రాల సంఖ్య 1813కు పెరిగింది. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కేటాయింపును పూర్తి చేశాం. అవసరమైన మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కూడా పూర్తైంది.

నాలుగు చోట్ల నాలుగు గంటల వరకే

మహబూబాబాద్‌, నర్సంపేట, డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయ ం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలింగ్‌ సిబ్బందికి మొదటి దశ శిక్షణ పూర్తైంది. రెండో దశ కూడా నిర్వహిస్తాం. బందోబస్తు నిర్వహించే పోలీసులతో కలిసి సుమారు 5 వేల మంది విధుల్లో పాల్గొంటారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌ పరిధిలో 44 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఇబ్బందులు రానివ్వం

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఈసారి అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందిస్తాం. ఓటింగ్‌ శాతం పెంచడానికి స్వీప్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు హోం ఓటుకు దరఖాస్తు చేసుకుంటే వారందరూ ఇంటి వద్దనే తమ హక్కును వినియోగించుకోవాలి.

సౌకర్యాలకు లోటు రానివ్వం

మే 13న జరిగే పోలింగ్‌, వేసవిని దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పిస్తాం. కేంద్రాల వద్ద మూత్రశాలలు, తాగునీటి వసతి, విద్యుత్తు సదుపాయం, ర్యాంపుల ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించాం. అన్నింటా తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాం. ఓటర్లు ఎండలో ఇబ్బంది పడకుండా టెంట్లు వేయిస్తాం.

నామపత్రాల దాఖలకు ఏర్పాట్లు

మహబూబాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అభ్యర్థితో కలిసి ఐదుగురిని కార్యాలయంలోకి అనుమతిస్తాం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాల స్వీకరణ ఉంటుంది. మూడు వాహనాలను మాత్రమే లోనికి అనుమతిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని