logo

Gold: ధర తగ్గినా.. కనిపించని మక్కువ..

అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో గత పది రోజులుగా బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.

Updated : 28 Jun 2023 09:00 IST

కళ తప్పిన బులియన్‌ మార్కెట్‌

నరసాపురం తూర్పుతాళ్లు, న్యూస్‌టుడే: అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో గత పది రోజులుగా బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు నెలలుగా 24 క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర రూ.63,500 వరకు ఎగబాకింది. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.60,300కు దిగివచ్చింది. ధరలు తగ్గినా అమ్మకాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని బులియన్‌ మార్కెట్‌ కళ తప్పుతోంది. ఆర్థిక మాంద్యం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, ఉత్పత్తి పెరగడం తదితర కారణాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ మాత్రమే ఎక్కువగా సాగుతోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బంగారం వ్యాపారానికి నరసాపురం పేరుగాంచింది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 900 దుకాణాలు ఉండగా నరసాపురంలోనే 90 వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో నెలకు సరాసరి రూ.200 కోట్లు వ్యాపారం జరుగుతుందని అంచనా. ఆ పరిస్థితి ఇటీవల కాలంలో కానరావడం లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఆషాఢ మాసం, ముహూర్తాలు లేకపోవడం, ఆక్వా, వ్యవసాయ రంగాల్లో నష్టాలు తదితర కారణాలతో బంగారం కొనుగోళ్ల శాతం తగ్గింది. బులియన్‌ మార్కెట్‌ ప్రభావం ఇతర రంగాలపైనా పడింది. గతంలో జిల్లాతోపాటు తూర్పు, కృష్ణా జిల్లాలు, తెలంగాణ నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. విక్రయాలు తగ్గడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నరసాపురం సర్కిల్‌ పరిధిలో ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయం కూడా తగ్గింది. ‘బంగారం ధరలు కొంత మేర తగ్గినా విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. తప్పనిసరి అయితేనే కొంటున్నారు.  ఎక్కువ మంది పాత బంగారం తాకట్టు, విక్రయించడమే కనిపిస్తోంది’ అని నరసాపురం బంగారు వర్తకుల సంఘ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని