logo

మెజార్టీ తగ్గితే మీ పని చెబుతా!

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల మెజార్టీ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని, లేకుంటే మీ పని చెబుతానని వాలంటీర్లను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 16 Apr 2024 02:11 IST

వాలంటీర్లకు ఎమ్మెల్యే రాచమల్లు హెచ్చరిక
ఒక్కొక్కరికీ రూ.5 వేలు వంతున చెల్లింపులు

ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల మెజార్టీ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని, లేకుంటే మీ పని చెబుతానని వాలంటీర్లను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించిన పురపాలక సంఘం కౌన్సిలర్లు వారిని వెంటబెట్టుకుని వైకాపా కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం ఇంటింటికెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆయా వార్డుల పరంగా ఓట్ల లెక్కింపు  తెలుస్తుందని, మెజార్టీ తగ్గితే మీరు సరిగ్గా పని చేయనట్లేనని తేల్చి చెప్పారు. మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందని, పని చేసినవారిని మాత్రమే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని, లేనివారిని పక్కన పెడతామని హెచ్చరించారు. లబ్ధిదారుల వ్యక్తిగత సమాచారం సేకరించాలని, వారి ఫోన్‌ నంబర్లతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వైకాపాకు మద్దతుగా ప్రచారం చేపట్టాలని వాలంటీర్లపై ఎమ్మెల్యే ఒత్తిడి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున రాజీనామా చేసిన వాలంటీర్లకు ఎమ్మెల్యే అందజేశారు. ఇన్నాళ్లు నిజాయతీగా పని చేసినా ప్రాధాన్యం, గుర్తింపు, విలువ లేకుండా పోయిందని మనసులో కుమిలిపోతూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రాజీనామా చేయాలంటూ కౌన్సిలర్లు రెండు రోజులుగా వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది  వాలంటీర్లు తమ చరవాణులను సైతం స్విచ్‌ ఆప్‌ చేసుకుని ఉండగా ఇళ్ల వద్దకు వెళ్లి మరీ ఒత్తిడి చేస్తున్నారు. మరికొంతమంది వాలంటీర్లు ఊర్లోలేమని చెప్పినా వినకుండా మీ సంతకాలతో మేమే రాజీనామా పత్రాలను అందిస్తామనే నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా 1,569 మంది వాలంటీర్లు ఉండగా, ఇప్పటికే 935 మంది రాజీనామా చేసినట్లు అధికారులు ప్రకటించారు. రాజీనామాలను పరిశీలించకుండానే అధికారులు ఆమోదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరివి ఫోర్జరీ సంతకాలతో రాజీనామా పత్రాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని