logo

Registration: 24 గంటల్లోనే పేరు మార్పిడి

‘నెలలు, సంవత్సరాల తరబడి నిలిచిపోయే మ్యుటేషన్ల దరఖాస్తులను.. ఇకపై ఒకే రోజులో ఆమోదించాలి. ధరణిలో జరిగే ఆస్తుల క్రయవిక్రయాలను పునఃపరిశీలించక్కర్లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చే వివరాలను యథాతథంగా ఆస్తిపన్ను

Updated : 22 Feb 2022 09:43 IST

ఇకపై తాత్సారం లేకుండా మ్యుటేషన్‌: కమిషనర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘నెలలు, సంవత్సరాల తరబడి నిలిచిపోయే మ్యుటేషన్ల దరఖాస్తులను.. ఇకపై ఒకే రోజులో ఆమోదించాలి. ధరణిలో జరిగే ఆస్తుల క్రయవిక్రయాలను పునఃపరిశీలించక్కర్లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చే వివరాలను యథాతథంగా ఆస్తిపన్ను రికార్డుల్లో చేర్చండి. గతంలో మాదిరి క్షేత్రస్థాయి తనిఖీల పేరుతో తొక్కిపెట్టొద్దు. ఆస్తుల మ్యుటేషన్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించండి.’ ఇదీ.. జీహెచ్‌ఎంసీ తాజా నిర్ణయం. కొత్త రిజిస్ట్రేషన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. సబ్‌రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలోనే జీహెచ్‌ఎంసీకి సంబంధించిన మ్యుటేషన్‌ రుసుము ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసిన ఇల్లు అయితే.. రిజిస్ట్రేషన్‌తోపాటే ఆస్తి పన్ను ఖాతా సంఖ్య వస్తుంది. పాత ఇల్లు/స్థలం రిజిస్ట్రేషన్‌ అయితే.. రికార్డుల్లో కొత్త యజమాని పేరును చేర్చాలంటూ జీహెచ్‌ఎంసీకి సబ్‌రిజిస్ట్రారు నుంచి దరఖాస్తు వెళ్తుంది. ఇలాంటి అర్జీలు సర్కిల్‌కు 30-40 చొప్పున 30 సర్కిళ్లకు నిత్యం వెయ్యికిపైగా వెళ్తుంటాయి. వాటిని ఇకపై ఏ రోజుకారోజు పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

8 లక్షల రిజిస్ట్రేషన్ల పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2010-21 వరకు(ధరణి సేవలు మొదలయ్యేనాటి వరకు) గ్రేటర్‌లోని సబ్‌రిజిస్ట్రారు కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌ పత్రాలపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టింది. చాలా మంది బల్దియా రికార్డుల్లో ఆస్తులను నమోదు చేయలేదనే ప్రచారం ఉంది. అందువల్ల.. రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చిన 8 లక్షల సేల్‌డీడ్‌ల పరిశీలనను జీహెచ్‌ఎంసీ భుజానికెత్తుకుంది. పత్రాలను సర్కిళ్ల వారీగా ఉపకమిషనర్లకు పంపింది. ఆ వివరాలను బల్దియా వద్దనున్న ఆస్తుల జాబితాతో పోలుస్తున్నారు. పన్ను పరిధిలో లేని ఆస్తులుంటే, క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. ఖాళీగా భూమి అయితే వేకెండ్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌(వీఎల్‌టీ), నిర్మాణం ఉంటే.. జరిమానాతో ఆస్తిపన్ను మదిస్తారు. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నది లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని