logo

Road Accident: మారాం చేసి బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఊపిరి వదిలి

తమ కిరాణా దుకాణంలో విక్రయించే సరకు కొనుగోలు చేద్దామని హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళుతున్న తండ్రి వెంట తానూ వస్తానని తనయుడు మారాం చేసి మరీ బయలు దేరాడు. అంతలోనే వీరు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని మృత్యువు రూపంలో

Updated : 11 May 2022 08:50 IST

తండ్రి కొడుకుల దుర్మరణం

యాచారం, న్యూస్‌టుడే: తమ కిరాణా దుకాణంలో విక్రయించే సరకు కొనుగోలు చేద్దామని హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళుతున్న తండ్రి వెంట తానూ వస్తానని తనయుడు మారాం చేసి మరీ బయలు దేరాడు. అంతలోనే వీరు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన కారు వెనకనుంచి బలంగా ఢీకొంది. ఈ తీవ్రతకు తండ్రీకొడుకులు తమ వాహనం పైనుంచి ఎగిరి కారుపై పడ్డారు. అంతే వేగంతో రోడ్డుపైకి విసిరేసినట్టుగా పడిపోయారు. అంతే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. సాగర్‌ రహదారిపై యాచారం ఠాణా పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం, సీసీ పుటేజీలలో రికార్డు అయిన మేరకు వివరాలు.. యాచారం మండలం మేడిపల్లిలో పెయింటర్‌గా పని చేసే ముచ్చర్ల రాములు(56) ఇంటి వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. దానికోసం సరకు తెచ్చుకుందామని కొడుకు సోను(11)తో కలిసి ద్విచక్ర వాహనంపై మాల్‌ మార్కెట్‌కు వెళ్తున్నాడు. తమ్మలోనిగూడెం సమీపంలోని ఎస్సార్‌ పెట్రోల్‌ పంపు వైపు మలుపు తిప్పే క్రమంలో యాచారం వైపు నుంచి మాల్‌ వైపు వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఇక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. మృతుడికి భార్య వెంకటమ్మ, కుమార్తె కామాక్షి(10) ఉన్నారు.

రహదారిపై బంధువుల ఆందోళన.. మృతుల బంధువులు సంఘటన స్థలంలోనే మృతదేహాలను ఉంచి ఆందోళనకు దిగారు. ఘటనకు కారణమైన కారు యజమాని వచ్చి నష్టపరిహారం చెల్లించాకే మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించాలని పట్టుబట్టారు. సీఐ లింగయ్య, ఎస్సై ప్రభాకర్‌ బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగగా సాయంత్రం 7.15 వరకు ఆందోళన కొనసాగించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంటి పెద్ద మృతితో కుటుంబం రోడ్డున పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని