icon icon icon
icon icon icon

ప్రధానితో చెప్పి జగన్‌కు ప్రత్యేకంగా ఓ జైలు

యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి 27 శాతానికి మించి ఓటు బలం ఉన్నా ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అని ఆలోచించానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Published : 21 Apr 2024 05:16 IST

‘పరదాల మహారాణి’ని సాగనంపే సమయం ఆసన్నమైంది
ఎన్డీయే అధికారంలోకి రావడం.. వైకాపా గూండాల తాటతీయడం ఖాయం
పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న వ్యక్తి యువతకు న్యాయం చేస్తారా?
వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

‘ఏంటమ్మా.. పరదాల మహారాణి.. కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టారట. విద్యార్థులూ జాగ్రత్త. కక్ష పెట్టుకుంటారు. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఆ మహారాణి పరదాల్లో తిరుగుతుంటారు. ఆమె వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. యువతరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది.’

జగన్‌ను ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్య


‘ఈ మధ్య వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో మోదీ, చంద్రబాబు, నా ఫొటోలు పెడుతూ.. వీళ్లు వస్తే చర్చిలకు ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. నా భార్య క్రిస్టియన్‌. నచ్చిన మతం తీసుకోమని నా బిడ్డలకు స్వేచ్ఛ ఇచ్చా.  చర్చికి వెళ్లి హిందూధర్మాన్ని.. తిరుమల, మసీదుకు వెళ్లి అన్యమత ప్రచారం తప్పుకదా? ఇదే విషయాన్ని చెప్పాను తప్ప.. నేనెప్పుడూ క్రైస్తవాన్ని ఖండించలేదు’  

 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సభలో జనసేనాని పవన్‌కల్యాణ్‌


ఈనాడు, రాజమహేంద్రవరం: యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి 27 శాతానికి మించి ఓటు బలం ఉన్నా ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అని ఆలోచించానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైకాపా ఫ్యాన్‌కు సౌండ్‌ ఎక్కువ, గాలి తక్కువని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శనివారం జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెదేపా ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. ‘మీపై చిన్న కేసున్నా పాస్‌పోర్టు, ఉద్యోగం ఏదీ రాదు. అలాంటిది మీ భవిష్యత్తు నిర్దేశించే వ్యక్తి.. ఖైదీ నంబరు 6093గా 16 నెలలు చిప్పకూడు తిని, పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు. ఆయన యువతకు న్యాయం చేస్తారా’ అని పవన్‌ ప్రశ్నించారు. ‘జగన్‌.. మేం వచ్చాక.. నీవు కోరుకున్న చోట వైఎస్‌ జగన్‌ ఎక్స్‌క్లూజివ్‌ సెంట్రల్‌ జైల్‌ను ప్రధానితో చెప్పి ఏర్పాటు చేయిస్తా’ అని పేర్కొన్నారు. జగన్‌ను ‘మోదీ గ్యారంటీ’తో జైలుకు పంపించడం ఖాయమన్నారు. ఎన్డీయే అధికారంలోకి రావడం.వైకాపా గూండాల తాటతీయడం తప్పదన్నారు.

నన్ను తిట్టడానికే కాపు ఎమ్మెల్యేలు..

‘కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమించారు. కొత్తగా ఇచ్చే నిధులను పక్కన పెడితే, ఉన్నవాటిని మళ్లించారు. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వలేనని చెప్పిన జగన్‌, 2014-19లో చంద్రబాబు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇస్తే వైకాపా వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తే నిత్యం నన్ను తిట్టే కాపు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పటికీ కాపు వర్గం జగన్‌వైపే ఉంటారనుకుంటే ఎంత వరకు సమంజసమో ఆలోచించండి. దామాషా ప్రకారం వెనుకబడిన కాపులకు ఎందుకు ఈబీసీ ఇవ్వలేదో జగన్‌ చెప్పాలి’ అని పవన్‌ నిలదీశారు.

అక్రమాలకు రాజధానిగా రాజానగరం

‘వైకాపా ఎమ్మెల్యేల్లో నా అభిమానులున్నా.. వారివల్ల సమాజానికి విఘాతం కలిగితే రాజకీయంగా విభేదిస్తానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రాజానగరం అనగానే గంజాయి వ్యాపారం, మూడు పెద్ద ఇళ్లు తీసుకుని బెట్టింగ్‌ నిర్వహణ, బ్లేడ్‌బ్యాచ్‌ దోపిడీలను ఓ పెద్ద కుటుంబం (జక్కంపూడి కుటుంబం) నుంచి వచ్చిన వాళ్లు చేస్తుండటం బాధ కలిగించింది. వేరే వ్యక్తులు స్థిరాస్తి వ్యాపారం చేస్తే 15 శాతం కమీషన్‌ ఇవ్వాలట. నన్నయ వీసీ పదవికి సైతం రూ.కోట్లు తీసుకున్నారు. కార్మిక నాయకుడిగా ప్రజలకు అండగా నిలిచిన జక్కంపూడి రామ్మోహనరావు బిడ్డలు ఈ రోజున ఇసుక, భవననిర్మాణ కార్మికుల పొట్టకొడుతున్నారు’ అని ఆరోపించారు. కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణను గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

 తోట త్రిమూర్తులు 28 ఏళ్ల క్రితం దళితులకు శిరోముండనం చేయిస్తే.. రాజానగరంలో ఇటీవలే జరిగిందన్నారు. ఇది అనైతికమని, ఇలాంటి అరాచకాలు పోవాలంటే ఇక్కడ జనసేన గెలవాలన్నారు.

నన్ను తిడితే కోపం రాదు..

జగన్‌ తనను ఎక్కువ తిడుతున్నారని, అయినా తనకు కోపం రాదన్నారు. దళిత డ్రైవర్‌ను చంపి, డోర్‌ డెలివరీ చేస్తే చాలా కోపం వచ్చిందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘నాలాంటోడు ఏదైనా తప్పు చేస్తే.. మీకు కత్తి ఇస్తాను. తల నరికేయండి’ అని జనసేనాని అన్నారు. ‘ఇక్కడ మాట్లాడుతుండగా నాకు ఒక మూట(తువ్వాలుతో చుట్టినది) తగిలింది.. అందులో ఏం పెట్టారో తెలియదు. జగన్‌లా పెద్ద గంత కట్టుకుని నాటకాలు చేయను, భరిస్తా’ అని అన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమెను గెలిపించాలన్నారు. ఆమె గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్నారు. గోదావరి ప్రక్షాళన చేస్తామన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం పూర్తి చేస్తుందని భరోసా ఇచ్చారు.

అజాత శత్రువు చిరంజీవిని అవమానించారు..

‘నేను గతంలో తెదేపాతో విభేదించినా..నా సినిమాల విషయంలో ఎటువంటి ఇబ్బందులకూ గురిచేయలేదు. కానీ జగన్‌.. ఆ రోజు చిరంజీవి, ప్రభాస్‌, మహేష్‌ వెళ్తే ఇంటి బయట నుంచి నడిపించి కనీసం భోజనం పెట్టలేదు. సినిమా టికెట్‌ ధరలు పెంచాలి.. అంటే నిర్మాతల మండలి ఉంది. కానీ ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చి చిరంజీవి అందరి తరఫునా మాట్లాడితే ఆయన్ను అవమానించారు. అజాత శత్రువు చిరంజీవి.. ఎన్ని విమర్శించినా ఏమీ అనని వ్యక్తిని జగన్‌ కించపరిచారు’ అని పవన్‌ మండిపడ్డారు.

వైకాపా పాలనలో తలలేని మొండెంలా రాష్ట్రం : పురందేశ్వరి

అయిదేళ్ల వైకాపా పాలనలో తలలేని మొండెంలా రాష్ట్రం తయారైందని, రాజధాని లేని రాష్ట్రమని అంతా హేళన చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జగన్‌ నిత్యం ఇంట్లో ఫ్యాన్‌ ఉండాలని అంటారని.. కానీ ఫ్యాన్‌ స్పీడ్‌ 1 నుంచి 4లోపు ఉండాలని, మనం 151 స్పీడ్‌ పెంచడంతో ఆ గాలికి ఇళ్లు కూలిపోవడంతో మనకు శిథిలాలే మిగిలాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img