icon icon icon
icon icon icon

మహిళల అభ్యున్నతికి చంద్రబాబు, లోకేశ్‌ కృషి

మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిరంతరం పరితపిస్తారని లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి పేర్కొన్నారు.

Published : 21 Apr 2024 06:09 IST

నారా బ్రాహ్మణి
మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం

మంగళగిరి, న్యూస్‌టుడే: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిరంతరం పరితపిస్తారని లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారని, ఆయనకు మరెవరూ సాటిరారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో శనివారం ఆమె పర్యటించారు. మండలంలోని ఎర్రబాలెం పారిశ్రామికవాడలోని ‘సంధ్యా స్పైసెస్‌’ కారం తయారీ పరిశ్రమలో మహిళా కార్మికులతో మాట్లాడారు. అనంతరం తాడేపల్లిలోని గౌడ కల్యాణ మండపంలో.. నియోజకవర్గంలో నారా లోకేశ్‌ అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకం లబ్ధిదారులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. మహిళా సాధికారతే లక్ష్యంగా లోకేశ్‌ అయిదేళ్లుగా సొంత నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలంతా ఒక్కటై లోకేశ్‌తోపాటు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. తాడేపల్లి, మంగళగిరిల్లో లోకేశ్‌ సొంత డబ్బుతో అన్న క్యాంటీన్లు నడుపుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారని పలువురు మహిళలు అన్నారు. రాజధాని నిర్మాణ పనుల వల్ల ఇంటిల్లిపాదికీ ఉపాధి లభించేదని, అయిదేళ్లుగా పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం రాజధాని పనులు నిలిపివేసి కనీసం కౌలు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన పింఛన్‌ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. బ్రాహ్మణి స్పందిస్తూ లోకేశ్‌ వద్ద మంగళగిరి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఉందన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ,  మహిళా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img