icon icon icon
icon icon icon

విజయాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాం

తమ నియోజకవర్గాల్లో గెలుపును పార్టీ అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని పలువురు తెదేపా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు.

Published : 22 Apr 2024 05:12 IST

బీఫాం అందుకున్న తెదేపా అభ్యర్థుల ధీమా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తమ నియోజకవర్గాల్లో గెలుపును పార్టీ అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని పలువురు తెదేపా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీఫాంలు అందుకున్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.


శ్రీకాకుళంలో అన్ని స్థానాలూ గెలుస్తాం  
ఎంపీ రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి

సీఎం జగన్‌కు కేసులు, దగా, మోసం తప్ప ఇంకోటి తెలియదు. అందుకే ఎన్నికల ముందు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలపై బురద చల్లుతున్నారు. ప్రజలు పాలకు, నీళ్లకు తేడా తెలుసుకున్నారు. దుర్మార్గుడైన జగన్‌ను గద్దె దించడానికి ఎదురుచూస్తున్నారు. కేసులు పెట్టి తెదేపా శ్రేణులను ఆందోళనకు గురిచేయాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారు. మా పార్టీ 40 ఏళ్లుగా ఇలాంటి జగన్‌లను చాలా మందిని చూసింది. నాతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలుస్తాం.


రామరాజుతో కలిసి ముందుకెళ్తా
- రఘురామకృష్ణరాజు, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి

రేపు ఉదయం ఉండి అసెంబ్లీకి నామినేషన్‌ వేస్తున్నాను. రామరాజుతో కలిసే పని చేస్తా. ఆయనతో కలిసి వెళ్లి నామినేషన్‌ వేస్తాను. రామలక్ష్మణుల్లా కలిసే ప్రచారం చేస్తాం.


విజయవాడ లోక్‌సభ పరిధిలోని అన్ని స్థానాలూ గెలుస్తాం
-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మైలవరం అభ్యర్థి

జగన్‌ రాజధానిని నిర్వీర్యం చేసి ఉపాధి, అభివృద్ధితో పాటు అన్ని రంగాలనూ నాశనం చేశారు. మా ప్రాంతానికి, నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తెదేపా ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. వైకాపా ప్రభుత్వం దానికి మరో రూ.7 కోట్లు కేటాయిస్తే ప్రజలకు సాగు, తాగునీరు అందేది. అది కూడా చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలనూ కైవసం చేసుకుంటాం.


నేను మాడుగుల నియోజకవర్గ అల్లుణ్ని: బండారు సత్యనారాయణమూర్తి

నేను మాడుగుల నియోజకవర్గ అల్లుణ్ని. అక్కడ నాకు చాలా మంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. పైలా ప్రసాద్‌తో మాట్లాడుతున్నాం. అందరితో కలిసి ముందుకు వెళ్తాం. శనివారం నిర్వహించిన నియోజకవర్గ సమావేశానికి అందరూ హాజరయ్యారు. ఇప్పటికే నాలుగు మండలాల నేతలతో సమావేశమయ్యాను. అందరూ సహకరిస్తున్నారు.


కూటమి గెలుపు అనివార్యం: కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి

రాష్ట్రంలోని యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను రక్షించుకోవాలంటే కూటమిని గెలిపించుకోవాలి. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాలనూ గెలిచి తెదేపా అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img