icon icon icon
icon icon icon

చంద్రబాబు ఇంట్లో నేతల సందడి

తెలుగుదేశం తరఫున లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంల పంపిణీ ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సందడిగా సాగింది.

Published : 22 Apr 2024 05:49 IST

బీఫాంలు అందుకోవడానికి తరలివచ్చిన అభ్యర్థులు
అందరితో కలిసి భోజనం చేసిన అధినేత
హాజరుకాని 14 మంది అభ్యర్థులు
తంబళ్లపల్లె, దెందులూరు అభ్యర్థులకు అందని ఆహ్వానం

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం తరఫున లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంల పంపిణీ ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సందడిగా సాగింది. అభ్యర్థులంతా తమ అనుచరులతో కలిసి వాహనాల్లో ఒకేసారి తరలిరావడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. బీఫాంలు అందజేసిన తర్వాత చంద్రబాబు వారందరితో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు వివిధ కారణాలతో హాజరు కాలేదు. ఇందులో తంబళ్లపల్లె, దెందులూరు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫాంల పంపిణీని పార్టీ పెండింగ్‌లో పెట్టింది. దీంతో అక్కడ అభ్యర్థులుగా ప్రకటించిన జయచంద్రారెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ ఉండవల్లికి రాలేదు. అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయమై కొలిక్కివస్తే.. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫాంల పంపిణీపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనపర్తి స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. అక్కడ నుంచి తెదేపా తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్‌ ఆశిస్తుండటంతో కొంత గందరగోళం నెలకొంది. అనపర్తి సీటు తెదేపా తీసుకుంటే.. తంబళ్లపల్లె, దెందులూరుల్లో ఒకటి భాజపాకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దెందులూరు నుంచి తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ వేయనున్నట్లు చింతమనేని ప్రభాకర్‌ ప్రకటించారు. మరో 12 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా బీఫాంల పంపిణీ కార్యక్రమానికి రాలేదు. వీరిలో ఉరవకొండ, రాయదుర్గం, నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్ల్లి, తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలు, మరికొందరు దూరాభారం అవుతుందని చెప్పినట్లు తెలిసింది. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరఫున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవీరెడ్డి తరఫున ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి బీఫాంలు అందుకున్నారు.

మీకు టికెట్‌.. తెదేపాలో కార్యకర్తకిచ్చే గౌరవం

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకూ లోక్‌సభకు వెళ్లే స్థాయి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు బీఫాం తీసుకునే సందర్భంలో చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మీకిచ్చిన సీటు.. పార్టీలో సామాన్య కార్యకర్తకు లభించే గౌరవం. కష్టపడి పనిచేయండి. మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు’ అని చంద్రబాబు ఆయన్ను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img