icon icon icon
icon icon icon

జగన్‌ విధ్వంసాన్ని.. జనానికి చెప్పండి

అయిదేళ్ల పాలనలో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. ఈ వర్గం, ఆ వర్గం అని లేకుండా అందర్నీ ముంచేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 22 Apr 2024 06:52 IST

1,500 మంది ప్రభావశీలురకు చంద్రబాబు దిశానిర్దేశం
‘బాబును మళ్లీ రప్పిదాం’ కార్యక్రమంపై అవగాహన
ఎర్రచందనమే కాదు.. యూకలిప్టస్‌నూ పెద్దిరెడ్డి వదల్లేదు
సర్వేపల్లి వెళితే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌-3) కనిపిస్తాయని ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అయిదేళ్ల పాలనలో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. ఈ వర్గం, ఆ వర్గం అని లేకుండా అందర్నీ ముంచేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతులు, కూలీలు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా వైకాపా ప్రభుత్వంలో నష్టపోయిన అన్ని వర్గాలకు అధికార పార్టీ అరాచకాల్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. జగన్‌ దోపిడీ, విధ్వంస పాలనపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చూడాలని.. ఇందుకోసం 1,500 మంది ప్రభావశీల వ్యక్తులు 175 నియోజకవర్గాల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భావితరాలకు జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రభావశీల వ్యక్తులతో ఆదివారం చంద్రబాబు సమావేశమయ్యారు. ‘బాబును మళ్లీ రప్పిదాం’ పేరుతో 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల్ని వారికి వివరించారు. పేదల రక్తం తాగే జలగ జగన్‌రెడ్డి అని చంద్రబాబు మండిపడ్డారు. పెద్దపెద్ద నియంతలు కూడా ఆయన ముందు తూగరన్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం, ఇసుక, భూములు, గనుల్ని దోచుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... తెదేపా ప్రభుత్వ హయాంలో పెంచిన యూకలిప్ట్టస్‌ చెట్లనూ వదల్లేదని మండిపడ్డారు. కేజీఎఫ్‌-1, 2 సినిమాల్ని చూస్తే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ గుర్తొస్తే.. సర్వేపల్లి వెళితే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌-3) కనిపిస్తాయని ఆరోపించారు. సత్యవేడు నుంచి రోజుకు 200 టిప్పర్లలో మట్టి, ఇసుక, గ్రావెల్‌ను తమిళనాడుకు తరలిస్తూ.. వైకాపా నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా అరాచకాలతోపాటు తెదేపా ప్రభుత్వంలో వివిధ వర్గాలకు జరిగిన మేలు, ఎన్డీయే ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని ప్రభావశీలురకు సూచించారు.

అడుగడుగునా దోపిడీ.. అయిదేళ్లుగా అరాచకం

‘జగన్‌ రూ.10 ఇచ్చి రూ.1000 దోచుకున్నారు. ఆయన పదేపదే బటన్‌ నొక్కానంటారు. అదేమైనా ఆయన సొంత సొమ్మా? ప్రజల నుంచి పన్నులు, ఛార్జీల బాదుడుతో లాక్కున్నది, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చిందే కదా! జగన్‌ దెబ్బకు అమరరాజా, లులూ, జాకీ, కియా అనుబంధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు. ఇసుక, గ్రావెల్‌, బెరైటీస్‌, సిలికా సహా సహజ సంపదను దోచేస్తున్నారు. తెదేపా ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అటవీ సంరక్షణలో భాగంగా పెద్ద ఎత్తున చెట్లు నాటించింది. సత్యవేడులో నాటిన యూకలిప్టస్‌ చెట్లనూ వైకాపా వాళ్లు ఊడ్చేశారు. తెదేపా హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని జగన్‌ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. జే గ్యాంగ్‌ అమ్ముతున్న నాసిరకం మద్యంతో 30 వేల మంది బలయ్యారు. సుమారు 30 లక్షల మంది ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయాయి. గత ప్రభుత్వంలో రైతులకు రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేశాం. బిందు, తుంపర సేద్యపరికరాల్ని రాయితీపై ఇచ్చాం. జగన్‌ వచ్చాక వీటన్నింటినీ పక్కనపెట్టేశారు. నేడు ఏపీ దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాల్లేక పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పైనే తొలి సంతకం పెడతా. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి’ అని సూచించారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వస్తే.. మీ ఆస్తులూ అమ్మేస్తారు

‘మీ తాతతండ్రులు సంపాదించి ఆస్తులు ఇస్తే.. వాటి పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్ల మీద జగన్‌ తన బొమ్మలు వేసుకుంటున్నారు. ఆ ఆస్తుల్ని కాజేయడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తమ దగ్గరే పెట్టుకొని.. యజమానులకు జిరాక్స్‌లు ఇస్తారట. రూ.10 వేల కోట్ల విలువ చేసే లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల్ని తన మామ కుమారుడికి రూ.500 కోట్లకు అప్పనంగా కట్టపెట్టాలని జగన్‌ చూస్తున్నారు. శ్మశానాలు, కొండలు, గుట్టలు, ముంపు ప్రాంతాల్లో పేదలకు సెంటు పట్టాలిచ్చి.. రూ.20 లక్షల విలువ చేసే ఆస్తులు ఇచ్చానంటూ సిగ్గులేకుండా చెబుతున్నారు. వీటన్నింటిపైనా ప్రజలను చైతన్యపరచండి’ అని ప్రభావశీలురకు సూచించారు.


వైకాపా రహిత రాష్ట్రంగా మార్చడం.. ఓట్ల బదిలీతోనే సాధ్యం

తెదేపా, జనసేన, భాజపా పొత్తు... ప్రజల్ని, రాష్ట్రాన్ని గెలిపించడానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వైకాపా రహిత రాష్ట్రంగా ఏపీ మారాలంటే మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు’ అనే విషయాన్ని మొదటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలకూ వివరించాలని తెలిపారు.


15 రోజుల్లో 1.8 కోట్ల మందిని కలవండి

రాబోయే 15 రోజుల్లో సుమారు 1.8 కోట్ల మందిని చేరుకోవాలని చంద్రబాబు ప్రభావశీలురకు సూచించారు. ‘ఒక్కో నియోజకవర్గంలో రోజుకు నాలుగు వీధి సమావేశాలు నిర్వహించండి. ఒక్కో సమావేశంలో 200 మంది ఉండాలి. అంటే ఒక ప్రభావశీల వ్యక్తి రోజూ 800 మందికి.. వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని, ఎన్డీయే ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ధిని తెలియజేయాలి. 1500 మంది 15 రోజులపాటు రోజుకు 800 మంది చొప్పున మొత్తం 1.8 కోట్ల మందిని చేరుకోవాలి. ఇప్పటి నుంచి ప్రతి గంటా మనకు కీలకమే’ అని దిశానిర్దేశం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img