icon icon icon
icon icon icon

ఉరవకొండలో నామినేషన్‌ వేళ వైకాపా హల్‌చల్‌

అనంతపురం జిల్లా ఉరవకొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన్‌ దాఖలు సమయంలో సోమవారం వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. పార్టీ జెండాలతో భారీగా తరలివచ్చి కోడ్‌ను ఉల్లంఘించాయి.

Published : 23 Apr 2024 05:46 IST

ఆర్వో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు శ్రేణుల యత్నం
పోలీసుల ప్రేక్షకపాత్ర

ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా ఉరవకొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన్‌ దాఖలు సమయంలో సోమవారం వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. పార్టీ జెండాలతో భారీగా తరలివచ్చి కోడ్‌ను ఉల్లంఘించాయి. సీఎం జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆర్వో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యాలయ ప్రాంగణం ముందు ఏర్పాటుచేసిన ఇనుప బారికేడ్లను ధ్వంసం చేశారు. దాదాపు గంటపాటు గందరగోళం సృష్టించారు. ప్రవేశం వద్దనున్న పోలీసు టెంటును సైతం ఆక్రమించి దర్జాగా కూర్చున్నారు. డివైడర్లపై కూర్చుని మద్యం తాగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల పక్కన ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడంతో 108 అంబులెన్సు చాలాసేపు ఆగింది. ఇదంతా చూస్తున్న పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.

జెండాలతో హల్‌చల్‌

తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలోనే జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ప్రాంగణం ఉంటుంది. వైకాపా శ్రేణులు కోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకుపోవడంతోపాటు జడ్జి ఛాంబర్‌ వరకు జెండాలతో వెళ్లి గది పక్కనే కూర్చున్నారు. సిబ్బంది వారించినా పట్టించుకోలేదు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులను నిబంధనల పేరుతో పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నించారు. సాధారణంగా నామినేషన్ల సమయంలో 200 మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమలుచేస్తారు. ఉరవకొండ ఆర్వో కార్యాలయం వద్ద ఆ దూరాన్ని నిర్దేశిస్తూ ఉదయాన్నే హెచ్చరికలు ఏర్పాటుచేశారు. అయితే వైకాపా శ్రేణులు వాటిని లెక్క చేయలేదు.  

వంద మీటర్ల దూరం సవరించుకునే ప్రయత్నం

నామినేషన్ల సమయంలో వంద మీటర్ల దూరం వరకు అభ్యర్థితోపాటు అయిదుగురికి మాత్రమే అవకాశమిస్తారు. వంద మీటర్ల దూరం ఆర్వో కార్యాలయం ప్రధాన ప్రవేశమార్గం వరకుంది. అదే ప్రాంగణంలో మిగతా కార్యాలయాలున్నాయి. వాటిలో పనిపై వచ్చేవారికి కొంత వెసులుబాటునిచ్చారు. ఆ స్థలంపోగా ఆర్వో కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటుచేశారు. అక్కడివరకు వైకాపా కార్యకర్తలు తరలివచ్చి కోడ్‌ ఉల్లంఘించారు. విషయం పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో వస్తే ఎన్నికల సంఘం ప్రశ్నిస్తుందని అధికారులు భావించి ఆత్మరక్షణలో పడ్డారు. అందరూ అక్కడ చేరి వంద మీటర్లు ఎక్కడివరకు వస్తుంది? ఇక్కడినుంచి లోపలికి రాలేదు కదా? ఎవరైనా ప్రశ్నిస్తే ఇక్కడికే వంద మీటర్లని చెబుదామని చర్చించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img