icon icon icon
icon icon icon

రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం

దేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం సూపర్‌-6 పథకాలతో కలిపి మొత్తం పది భరోసాలు అమలు చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.

Published : 24 Apr 2024 05:57 IST

అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు
నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
వాలంటీర్లకు రూ.10 వేల జీతం
ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇస్తాం
ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు.. మెరుగైన పీఆర్సీ
సూపర్‌-6 పథకాలకు అదనంగా నాలుగు అమలు చేస్తాం
పాతపట్నం, ఆమదాలవలస ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌ - శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస గ్రామీణం, ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం సూపర్‌-6 పథకాలతో కలిపి మొత్తం పది భరోసాలు అమలు చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఆమదాలవలసల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజల ఆదాయం తగ్గిపోయింది. జీవన ప్రమాణాలు పడిపోయాయి. ముఖ్యమంత్రికి అహంకారం నెత్తికెక్కింది. చుక్కల భూములను దోచేశారు. ప్రజల భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవడం సైకోయిజమే. మేం అధికారంలోకి రాగానే భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. పంటల బీమా మళ్లీ తీసుకువస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఆక్వా సాగుకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కి ఇస్తాం. ఉద్యాన పంటలు, బిందు, తుంపర సేద్యాన్ని పునరుద్ధరిస్తాం. రాయితీపై ట్రాక్టర్లు, యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తాం’ అని అన్నదాతలకు హామీలు ఇచ్చారు.

చెత్త పన్ను రద్దు చేస్తాం

  • భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల పెంపు ఉండదు. కుదిరితే ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచే ఛార్జీలు తగ్గిస్తాం.
  • చెత్త పన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నులు నియంత్రిస్తాం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పన్ను నియంత్రిస్తాం. మీపై భారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటాం.

ప్రాణాలు తీస్తున్న ‘జే’ బ్రాండ్లు లేకుండా చేస్తాం

జగన్‌ అధికారంలోకి వచ్చాక మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకొని రూ.60 ఉన్న క్వార్టర్‌ మద్యాన్ని రూ.200 చేశారు. నాణ్యత లేని మద్యం తయారు చేస్తూ వేల మంది ప్రాణాలు తీస్తున్నారు. డబ్బుల కక్కుర్తితో మహిళల పుస్తెలు తెంచారు. మద్యం దుకాణాల్లో మాత్రం నగదు తీసుకుని తాడేపల్లికి తరలిస్తున్నారు. జగన్‌ మద్యనిషేధం అని మోసం చేశారు. నేను అలా మాయమాటలు చెప్పను. మద్యం దోపిడీ నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాం. ధరలను నియంత్రిస్తాం. మీ ప్రాణాలు తీస్తున్న ‘జే’ బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేస్తాం.

  • దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తాం. మన రాష్ట్రంలోనే ఐటీ, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వచ్చేలా చేస్తాం.
  • ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం.
  • ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
  • వర్క్‌ ఫ్రం హోం సదుపాయంతో స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం.
  • స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందిస్తాం.
  •  కేంద్రం ఇళ్ల కోసం రూ.1.50 లక్షలు ఇస్తుంటే జగన్‌ దానికి రూ.30 వేలు కలిపి, అంతా ఆయనే ఇచ్చినట్లు హడావుడి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు తీసుకున్న వారి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. అందరికీ రెండు సెంట్ల స్థలమిచ్చి, ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతాం.
  • వాలంటీర్ల జీతాలు రూ.10 వేలు చేస్తాం.

పింఛను తొలగించం

  • రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ఆంక్షలు లేకుండా చేస్తాం. పింఛను రూ.4 వేలు చేసి మీ ఇంటి వద్దే అందిస్తాం. ఒకటి, రెండు నెలలు తీసుకోకపోయినా.. అన్నీ కలిపి ఆ తర్వాత నెలలో అందజేస్తాం.
  • కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటిందని, మీ అబ్బాయికి కారు ఉందని పింఛన్లు తీసెయ్యం.
  • వికలాంగులకు రూ.6 వేల పింఛను ఇస్తాం. బీసీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం
  • ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం.
  • ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పింఛనుదారులను అన్ని విధాలా ఆదుకుంటాం.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

  • కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
  • నాగావళి, వంశధార, కృష్ణా, గోదావరి, పెన్నా నదుల్ని అనుసంధానిస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరందించవచ్చు. అది నా కల.

ధ్వంసమైపోయిన రోడ్లు బాగు చేస్తాం..

జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క కొత్త రోడ్డూ వేయలేదు. ఉన్న రోడ్లను బాగు చేసే దిక్కు లేదు. ఈ పరిస్థితిని మారుస్తాం. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో రోడ్ల బాగుపై దృష్టిపెడతాం.

సభాపతిని ప్రజాకోర్టులో శిక్షిస్తాం

సైకో మాటలకు తలూపి తమ్మినేని సీతారామ్‌ స్పీకర్‌ స్థానాన్ని అప్రతిష్ఠపాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మనం కొట్టే దెబ్బకు ఆయన ఎక్కడికి పోయినా పట్టుకొచ్చి ప్రజాకోర్టులో శిక్షిస్తామని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img