icon icon icon
icon icon icon

జగన్‌ దగ్గరున్న రూ. లక్ష కోట్లు ప్రజలవే

‘ఒకప్పుడు ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉందంటూ జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. అలాంటి వ్యక్తి తనయుడైన జగన్‌ దగ్గర ఇప్పుడు రూ. లక్ష కోట్లు ఉన్నాయంటే అవన్నీ ప్రజల సొమ్ములే’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Published : 24 Apr 2024 05:59 IST

రూ. 930 కోట్ల జనం సొమ్ము సాక్షికి మళ్లించారు
ఉప్పాడ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

‘‘సింహాలు సింగిల్‌గా వస్తాయంటూ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జలా! మనం ఉన్నది జంతు ప్రపంచంలో కాదు. మానవ ప్రపంచంలో. మీరు చిరంజీవి జోలికి రాకండి. ఆయన పద్మ విభూషణ్‌ బిరుదాంకితుడు. రజనీకాంత్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత. రజనీకాంత్‌ చంద్రబాబు గురించి మాట్లాడితే ఆయన్నీ తిడతారు. చిరంజీవినీ తిడతారు. అందరూ మీ పల్లకీలు మోయరు. ప్రజల్ని పల్లకీలు ఎక్కించి మేం బోయీలుగా వెళ్తున్నాం. చిరంజీవి గురించి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నేను గూండాల్లా మాట్లాడిన చాలామందిని చూసి వచ్చాను.  

ఉప్పాడ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధ్వజం

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కొత్తపల్లి: ‘ఒకప్పుడు ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉందంటూ జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. అలాంటి వ్యక్తి తనయుడైన జగన్‌ దగ్గర ఇప్పుడు రూ. లక్ష కోట్లు ఉన్నాయంటే అవన్నీ ప్రజల సొమ్ములే’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ‘బ్యాంకుల్లో ఉన్నది మన డబ్బు. బ్యాంకు మేనేజర్‌, ఛైర్మన్‌ దానికి కాపలాదారులు. కానీ వాళ్లు ఆ సొమ్మును తమ ఇష్టానుసారం ఖర్చుపెడతామంటే మనం ఊరుకుంటామా? అలాంటిది ఒక ముఖ్యమంత్రి మనందరి కష్టాన్ని, మనం కట్టిన పన్నుల డబ్బును సాక్షి పత్రిక కోసం ఖర్చుపెట్టారు. ఒక్కో వాలంటీరుకు రూ. 200 చొప్పున నెలనెలా ఇచ్చి ఆ పత్రికను కొనాలన్నారు. అలా ఈ ఐదేళ్లలో రూ. 330 కోట్లు వెచ్చించారు. ఆ డబ్బుతో ఉప్పాడలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించుంటే 20 వేలమందికి ఉపాధి దక్కేది. సాక్షి పేపర్‌ కొనిపిస్తున్న డబ్బులు జగన్‌వి కాదు. మీ డబ్బులు. మీ కష్టం. రూ. 420 కోట్లు పెట్టి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించండని మత్స్యకారులు కోరితే పట్టించుకోకుండా సాక్షి పేపర్‌కు జనం సొమ్ము మళ్లించారు. 41 మంది సాక్షి ఉద్యోగులను పీఆర్వోలుగా, మీడియా మేనేజర్లుగా పెట్టుకుని దానికి కొంత డబ్బు వృథా చేశారు. ఆ పత్రికలో యాడ్‌ల కోసం రూ. 600 కోట్లు. ఇలా కళ్లముందే రూ. 930 కోట్లు సాక్షికి వెళ్లిపోయాయి’ అని పవన్‌ ధ్వజమెత్తారు. ‘జగన్‌ ఎన్నో కేసుల్లో పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివ్యక్తి. చెల్లెలి వ్యక్తిగత జీవితాన్ని తన మనుషులతో సోషల్‌ మీడియాతో తిట్టించారు. రేప్పొద్దున్న మీ జోలికి రారని చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.  ‘రాష్ట్రంలో 30 వేల పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. మనవాళ్లు కాదని అనుకోవద్దు. చంద్రబాబు సతీమణిని తిడితే మన ఇంట్లో ఆమె కాదని అనుకోవద్దు. అలా అనుకోబట్టే సొంత చెల్లి షర్మిలను తిట్టే స్థాయికి వచ్చారు. మళ్లీ ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి’ అని కోరారు. నా మీద ఎవరినైనా పోటీ పెట్టొచ్చు.. వంగా గీతనైనా పోటీ పెట్టొచ్చు.. కానీ నా పోటీ మాత్రం జగన్‌తోనే’ అని పవన్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలని, నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలని అనుకునేలా పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

సెజ్‌ సమస్యే రాజకీయాల్లోకి రమ్మంది

రాజకీయాల్లో పోరాడాలనే కోరికకు ఎస్‌ఈజెడ్‌ కారణమని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ‘రాజశేఖరరెడ్డి ఎస్‌ఈజెడ్‌ ప్రారంభించారు. కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు స్థాపిస్తాం. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని 2009లో 10 వేల ఎకరాలు తీసుకున్నారు. రైతులను రోడ్డున పడేశారు. పరిశ్రమలు రాలేదు. యాజమాన్యం మారిపోతోంది. అరబిందో చేతికి వెళ్లిపోయింది. అరబిందో నుంచి నేను పార్టీ ఫండ్‌ తీసుకోలేదు. మీరు అభిమానంతో ఇచ్చిన రూపాయే నాకు లక్షతో సమానం’ అని అన్నారు. ‘అరబిందో వాళ్లు ఏదో గ్రామం అభివృద్ధి చేశామని సీఎస్‌ఆర్‌ కింద ప్రకటించారు. ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కూటమి బాధ్యత తీసుకుంటుంది’ అని పవన్‌ హామీ ఇచ్చారు. ‘ఎస్‌ఈజెడ్‌లో ఇంకా ఎందుకు పరిశ్రమలు పెట్టలేదని అడిగితే. కోడి పొదగలేదు. గుడ్డు పెట్టలేదని మంత్రి చెప్పారు. వైకాపా కోడి కాదు. కట్లపాము. దాని గుడ్లు అదే తినేస్తుంది’ అని పేర్కొన్నారు.


నా వ్యక్తిగత జీవితం పైనా విమర్శలా?

‘పేదల కోసం మానవ హక్కులకు భంగం కలుగుతుంటే మాట్లాడాను. లక్షలమంది మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217ను చించేశాను. దానికి ఇంట్లో ఉన్న నా భార్యను తిడతారు. పెళ్లాం అంటారు. ఈ నాలుగో పెళ్లానికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ‘నా భార్య రాజకీయాల్లో ఉంటే మీరు తూలనాడినా అర్థం ఉంటుంది. పాపం తనెక్కడో కూర్చుని పిల్లలను చూసుకుంటోంది. అంతకుముందూ నాకు పెళ్లయింది నిజమే. నేను ఎక్కడా అబద్ధాలు చెప్పలేదే! కొన్ని జీవితాలు కుదరవు.. విడిపోయాం. నన్ను పెళ్లి చేసుకున్నవారు, ఎవరి జీవితాల్లోకి వారు వెళ్లిపోయారు. ఒకమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుని బిడ్డను కన్నది. నా బిడ్డలను ఇంకొకరు చూసుకుంటున్నారు. గుట్టుగా బతుకుతున్నవారిని కూడా తీసుకొచ్చి పెళ్లాలు అంటే ఎలా?’ అని పవన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘భారతి గారిని పేరుపెట్టి పిలవాలంటే తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అడ్డొస్తోంది. నన్ను, చంద్రబాబును తిడితే సంతోషపడకండి. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేప్పొద్దున అది మీకు కూడా జరుగుతుంది. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని ప్రజలను పవన్‌్ కల్యాణ్‌ కోరారు. ‘హార్బర్‌ కట్టిస్తా.. జెట్టీలు నిర్మిస్తా అని చెప్పి నెరవేర్చని వ్యక్తి జగన్‌. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓట్లు అడిగే అర్హత లేదు. అయిదేళ్ల విలువైన కాలం మనం ఇస్తే ఈ రోజు ఏమీ నిర్మించలేకపోయారు అని పవన్‌ విమర్శించారు. ‘జగన్‌ లంచం తీసుకుంటే మనకొచ్చే నష్టమేంటి? జగన్‌ అవినీతి చేస్తే నా జేబులోంచి డబ్బులు తీసుకోవడం లేదు కదా.. అని అనుకోకండి. ఇకనైనా మీరు ఎంత నష్టపోయారో ఆలోచించండి. వైకాపాను సాగనంపండి’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img