icon icon icon
icon icon icon

భువనేశ్వరి పర్యటనకు వెళ్లారని ఎస్టీలపై జులుం

‘కూలి చేసుకునే మీకెందుకురా రాజకీయాలు.. ఎంత ధైర్యముంటే భువనేశ్వరి మీటింగ్‌కు వెళ్లారు? అక్కడికి వెళ్లే నాయకులారా మీరు.. మీరు ఈ ఆటోలోనే వెళ్లారా.. దీన్ని ఎక్కడైనా దొంగతనం చేశారా.. ఇది అలాగే ఉంది’ అంటూ కులం పేరుతో ఎస్టీలపై ఓ ఎస్సై విరుచుకుపడ్డారు.

Published : 24 Apr 2024 06:08 IST

అసభ్య పదజాలంతో దూషణలు
వైకాపా నాయకుల  ప్రోద్బలంతో ఎస్సై వేధించారని డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు

కుప్పం పట్టణం, రామకుప్పం, న్యూస్‌టుడే: ‘కూలి చేసుకునే మీకెందుకురా రాజకీయాలు.. ఎంత ధైర్యముంటే భువనేశ్వరి మీటింగ్‌కు వెళ్లారు? అక్కడికి వెళ్లే నాయకులారా మీరు.. మీరు ఈ ఆటోలోనే వెళ్లారా.. దీన్ని ఎక్కడైనా దొంగతనం చేశారా.. ఇది అలాగే ఉంది’ అంటూ కులం పేరుతో ఎస్టీలపై ఓ ఎస్సై విరుచుకుపడ్డారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా.. తెదేపా నాయకుల అండతో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్‌కు బాధితులు మంగళవారం ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కావలిమడుగు గ్రామానికి చెందిన బాధితులు కార్తీక్‌, వడివేలు, తంగవేలు, రాజ్‌కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్న మేరకు.. కుప్పంలో శుక్రవారం (ఈ నెల 19న) జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన 100 మంది ఆటోలు, వాహనాల్లో వెళ్లారు. విషయం తెలుసుకున్న పంద్యామడుగుకు చెందిన వైకాపా నాయకుడు మురుగేశ్‌.. శనివారం కావలిమడుగుకు చేరుకుని తెదేపా నామినేషన్‌కు ఎందుకు వెళ్లారని అసభ్య పదజాలంతో దూషించారు. మరుసటి రోజు సాయంత్రం రామకుప్పం ఎస్సై శివకుమార్‌ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా ఇళ్లలోకి చొరబడ్డారు. భువనేశ్వరి నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లారంటూ దూషించారు. మహిళలను సైతం లెక్కచేయకుండా వస్తువులన్నీ చిందర వందర చేస్తూ గాలించారు. ఇంట్లో నాటు తుపాకులు ఉన్నాయని, వాటితో పాటు ఆధార్‌కార్డులు తెచ్చి అప్పగించకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఇదంతా వైకాపా నాయకుడు మురుగేశ్‌ ప్రోద్బలంతోనే చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ బాధితులకు అండగా నిలిచారు. ఎస్సై వేధింపులపై ఆయన డీఎస్పీ, ఎస్పీ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐతో సమగ్ర విచారణ జరిపిస్తామని డీఎస్పీ శ్రీనాథ్‌ హామీ ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img