icon icon icon
icon icon icon

ఆడపిల్లలకూ గంజాయి అలవాటు చేస్తున్నారు

గుంటూరు నగర శివారు స్వర్ణభారతి నగర్‌లో వైకాపా వాళ్ల అండతో గంజాయి బ్యాచులు చెలరేగిపోతున్నాయని, చివరికి బాలికలకూ గంజాయి అలవాటు చేసి..వారిపై దారుణాలకు ఒడిగడుతున్నారని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ఆరోపించారు.

Published : 24 Apr 2024 06:12 IST

గంజాయి బ్యాచులకు గతంలో సుచరిత...ప్రస్తుతం అప్పిరెడ్డి అండ
వైకాపా వాళ్ల దారుణాల్ని వెలుగులోకి తెచ్చేందుకే బొటనవేలు నరుక్కున్నా..
ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గుంటూరు నగర శివారు స్వర్ణభారతి నగర్‌లో వైకాపా వాళ్ల అండతో గంజాయి బ్యాచులు చెలరేగిపోతున్నాయని, చివరికి బాలికలకూ గంజాయి అలవాటు చేసి..వారిపై దారుణాలకు ఒడిగడుతున్నారని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ఆరోపించారు. పేదల భూములకు నకిలీ హక్కు పత్రాలు సృష్టించి.. అసలైన హక్కుదారుల్ని రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. వీరికి గతంలో మాజీ హోంమంత్రి సుచరిత అండగా ఉండగా...ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరగుతున్న అరాచకాల్ని ప్రపంచానికి తెలియజేయాలనే తన బొటనవేలు నరుక్కున్నట్టు ఆమె స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి రామాంజనేయులుతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.

మత్తుకు బానిసలైన మైనర్లే...వైకాపా నేతల అనుచరులు

‘‘ప్రత్తిపాడు నియోజకవర్గంలో గంజాయి విచ్చలవిడిగా వాడుతున్నారు. మైనర్లు మత్తుకు బానిసలై సైకోల్లా ప్రవర్తిస్తున్నారు. వీరిని వైకాపా నాయకులు తమ అనుచరులుగా పెట్టుకొని..అరాచకాలు సృష్టిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే...గంజాయి ఎవరు అమ్ముతున్నారో చెప్పండి పట్టుకుంటామని చెబుతున్నారు. మేం చూపిస్తే..వాళ్లు పట్టుకునే కాడికి పోలీసు వ్యవస్థ ఎందుకు? గంజాయి తాగుతున్న మైనర్లపై పోలీసులు కేసులు పెడుతున్నారు కానీ.....అసలు దాన్ని తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇలాగైతే మార్పు వస్తుందా?’’ అని శ్రీలక్ష్మి ప్రశ్నించారు. స్వర్ణభారతి నగర్‌లో ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన ఘటనపై ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా...వైకాపా వాళ్లను ఏం చేయలేమంటూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె వాపోయారు.

నా ముందే సుచరిత ఫైల్‌ విసిరేశారు

‘‘ఈ దారుణాలపై ఫిర్యాదు చేయడానికి మాజీమంత్రి సుచరిత దగ్గరకు వెళితే.. ఆమె నేనిచ్చిన ఫైల్‌ను నా ముందే విసిరేశారు. అప్పిరెడ్డి దగ్గరకు వెళ్లినా అదే పరిస్థితి. ఈ అరాచకాలపై నాలుగేళ్లుగా పోరాడుతున్న నన్ను వేధిస్తున్నారు’’ అని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. స్వర్ణభారత్‌ నగర్‌లో ఉన్న పరిస్థితే నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సారా తాగించడానికి, గంజాయి మత్తులో ముంచడానికేనా జగన్‌కు అధికారం ఇచ్చింది అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img