icon icon icon
icon icon icon

కాపు రిజర్వేషన్లకు గండి కొట్టిందే వైకాపా

‘కాపు రిజర్వేషన్లకు గండి కొట్టింది వైకాపా.. 27 దళిత పథకాలను తీసేసింది జగన్‌.. ఈ ప్రభుత్వ పాలనలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు.

Published : 25 Apr 2024 06:33 IST

27 దళిత పథకాలు తీసేసిందీ జగనే
30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైంది వీళ్ల పాలనలోనే
అలాంటి పార్టీ నుంచి ఎలా  పోటీ చేస్తున్నారో వైకాపా అభ్యర్థులు చెప్పాలి
మనం మారాల్సిన.. ముఖ్యమంత్రిని  మార్చాల్సిన సమయమిది
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, కాకినాడ: ‘కాపు రిజర్వేషన్లకు గండి కొట్టింది వైకాపా.. 27 దళిత పథకాలను తీసేసింది జగన్‌.. ఈ ప్రభుత్వ పాలనలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. ఈ ప్రభుత్వ హయాంలోనే 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అదేం చెప్పకుండా, మేం వచ్చాం.. మాకు ఓట్లెయ్యండి.. రూ. 400 కోట్లు ఖర్చుపెడతాం. ఓటుకు రూ. 10 వేలు ఇస్తాం.. రూ. 10 లక్షలు పెట్టి నాయకులను కొనేస్తామంటే కుదరదు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. కాకినాడలో జనసేన- తెదేపా- భాజపా కూటమి లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ నామినేషన్‌ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమని.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని, ఓ తరం కోసమని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎంను మార్చాల్సిన సమయమిది..

జగన్‌ జైలుకు వెళ్లడం గ్యారంటీ అని మోదీ చెప్పారని పవన్‌ అన్నారు. 30 కేసులు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయనను మార్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. జగన్‌కు ఐదేళ్లు అవకాశం ఇస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఏ పథకమూ సవ్యంగా అందడంలేదని తెలిపారు. 5 కోట్ల ప్రజలకు తాము మాట ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు.

గంజాయి కేంద్రంగా కాకినాడ..

కాకినాడలో రౌడీయిజం ఎక్కువైందని, గంజాయికి కేంద్రంగా మారిందని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  ‘కాకినాడ వైకాపా లోక్‌సభ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ తనను గెలిపిస్తే రూ. 400 కోట్లతో గ్రామాలు అభివృద్ధి చేస్తానని.. గెలుపు తనదేనని అంటున్నారు కదా’ అని విలేకర్లు పవన్‌ కల్యాణ్‌ వద్ద ప్రస్తావించగా, ‘నాలుగైదు నెలలుగా రూ. 400 కోట్లు మాత్రం కలెక్ట్‌ చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. సునీల్‌ తమకు శత్రువు కాదని.. తమ కుటుంబంతో ఆయనకు స్నేహం ఉందన్నారు. ఆయన ప్రతిసారి అవకాశవాదంతో ఎన్నికల్లో నిలబడడం, వెళ్లిపోవడం.. వంటివి సరైన సంకేతాలు కావన్నారు. ‘నేను ఓడిపోగానే పార్టీ మూసేసి వెళ్లిపోయి, మళ్లీ వస్తే నమ్ముతారా’.. అని పవన్‌ ప్రశ్నించారు

డప్పుల దరువు.. పవన్‌ స్టెప్పులు..

కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన రోడ్డుషోలో కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామితో కలిసి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. డప్పు కొడుతుండగా.. పవన్‌ చేతులు ఊపుతూ చిన్నపాటి స్టెప్పులేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఎండ తీవ్రతకు నీరసించిన పవన్‌ ర్యాలీ ముగిసే సమయంలో ప్రచార రథంపైన, తర్వాత ద్విచక్రవాహనం పైనా కాసేపు సేదతీరారు. అనంతరం అభ్యర్థితో కలిసి నామినేషన్‌ దాఖలుకు కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లారు.


29న తిరుపతి రానున్న పవన్‌ కల్యాణ్‌

నసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 29న తిరుపతిలో పర్యటించనున్నారు. తొలుత 26న తిరుపతిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా.. 29కి వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img